సంగీత దర్శకుడిగా మారిన పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్
పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ సినిమాల్లోకి వస్తున్నాడంటూ చాలా రోజులుగా వార్తలు వచ్చాయి. తాజాగా అకిరా నందన్ ఒక షార్ట్ ఫిలిమ్ కు పనిచేశాడు. ఈ విషయాన్ని హీరో అడవి శేష్ తన ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. రైటర్స్ బ్లాక్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిలిమ్ కు కార్తీక్ యార్లగడ్డ దర్శకత్వం వహించారు. ఈ షార్ట్ ఫిల్మ్ కు అకిరా నందన్ సంగీతం అందించాడు. ఒక యువ రచయిత రచన చేసే టైంలో పడే ఇబ్బందులని ఈ షార్ట్ ఫిలిం లో చూపించారు. ఒక రచన చేయాలంటే ఎంత మధన పడాల్సి వస్తుందో, ఎంత ఒత్తిడికి గురి కావాల్సి వస్తుందో రైటర్స్ బ్లాక్ లో వివరించారు.
గతంలో దోస్తీ పాటను పియానో మీద వాయించిన అకిరా నందన్
దాదాపు 5 నిమిషాల నిడివి కలిగిన ఈ షార్ట్ ఫిలిం ఆసక్తికరంగా ఉంది. అకిరా నందన్ అందించిన సంగీతం కథకు తగ్గట్టుగా పర్ఫెక్ట్ గా కుదిరింది. అకిరా నందన్ కు సంగీతం అంటే చాలా ఇష్టం. ఈ విషయం అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా జనాలకు తెలుస్తూనే ఉంది. ఆర్ఆర్ఆర్ లోని దోస్తీ పాటను తన పియానో మీద వాయించి చూపించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. రైటర్స్ బ్లాక్ షార్ట్ ఫిలిం తో సంగీత దర్శకుడిగా మారిన అకిరా నందన్, వెండితెర మీదకు ఎప్పుడు వస్తాడోనని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అకిరా నందన్ ని హీరోగా చూడాలని పవన్ అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.