Ustaad Bhagat Singh: పవన్‌ను అత్యంత మాస్‌గా చూపిస్తా.. హరీష్ శంకర్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ అభిమానులతో పాటు సినీప్రియులందరూ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్లు సినిమాపై హైప్‌ను పెంచగా, తాజాగా దర్శకుడు చేసిన వ్యాఖ్యలు అంచనాలను మరింత పెంచాయి. ఉగాది సందర్భంగా మార్చి 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న హరీష్ శంకర్ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఆయన ఈ చిత్రంలోని ఇంటర్వెల్ సీన్ గురించి మాట్లాడారు.
Details
బెస్ట్ ఇంటర్వెల్ సీన్ అవుతుంది
పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ఇది బెస్ట్ ఇంటర్వెల్ సీన్ అవుతుందని ఆయన పేర్కొన్నారు. గతంలో గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్‌ను చూపించిన విధానం ఒక ఎత్తయితే, ఈ సినిమాలో అందుకు మించిన మాస్ ఎలిమెంట్స్ ఉంటాయని హింట్ ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్‌పై తనకు ఉన్న అభిమానాన్ని మరోసారి వెల్లడించారు. ఆయనను వెండితెరపై అత్యంత పవర్‌ఫుల్‌గా చూపించాలనే స్వార్థం నాకుంది. ఈ సినిమా చూసిన తర్వాత పవన్‌ను ఇంత మాస్‌గా హరీష్ శంకర్ మాత్రమే చూపించగలడని అందరూ అనాలని ఆయన అన్నారు. ఈ సినిమాలో శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఏ సర్టిఫికేట్ లభించినట్లు చిత్రబృందం వెల్లడించింది.