Loading...
K. Raghavendra Rao: పెమ్మసాని హీరో.. నిర్మాత కూడా ఆయనే! సినిమా తీస్తానన్న రాఘవేంద్రరావు
పెమ్మసాని హీరో.. నిర్మాత కూడా ఆయనే! సినిమా తీస్తానన్న రాఘవేంద్రరావు

K. Raghavendra Rao: పెమ్మసాని హీరో.. నిర్మాత కూడా ఆయనే! సినిమా తీస్తానన్న రాఘవేంద్రరావు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 19, 2026
04:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ సీనియర్ దర్శకుడు కె. రాఘవేంద్రరావు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెమ్మసానిని కథానాయకుడిగా పెట్టి సినిమా తీయాలని ఉందని ఆయన సరదాగా పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహిస్తున్న ఉత్సవాల వేదికగా రాఘవేంద్రరావు చేసిన ఈ వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. విజయవాడ ఉత్సవాల్లో పాల్గొన్న రాఘవేంద్రరావు ప్రసంగిస్తూ.. పెమ్మసాని హీరోగా నటించడంతో పాటు, ఆయనే నిర్మాతగా వ్యవహరిస్తే సినిమా రూపొందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. "హీరో మాత్రమే కాదు, నిర్మాత కూడా పెమ్మసానే అయితే సినిమా రూపొందించడానికి నేను సిద్ధం" అని ఆయన పేర్కొన్నారు. దీంతో వేదికపై ఉన్న కేంద్ర మంత్రి పెమ్మసానితో పాటు ఇతర అతిథులంతా నవ్వుల్లో మునిగిపోయారు.

వివరాలు

విజయవాడతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న రాఘవేంద్రరావు

ఈ సందర్భంగా రాఘవేంద్రరావు విజయవాడతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

తాను విజయవాడకు వచ్చిన ప్రతిసారీ కనకదుర్గమ్మ తనకు ఒక కథను అందిస్తుందని ఆయన తెలిపారు.

ఈసారి కూడా ఓ కథ గురించి ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడలోనే జన్మించిన తనకు ఈ నగరంతో పాటు కృష్ణా నదితో విడదీయలేని అనుబంధం ఉందని పేర్కొన్నారు.

తన సినీ కెరీర్‌లో ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నప్పటికీ, సొంత గడ్డపై విజయవాడ ఉత్సవాల్లో పురస్కారం స్వీకరించడం ఎంతో ప్రత్యేకమని రాఘవేంద్రరావు సంతోషం వ్యక్తం చేశారు.

సొంత ఊరిలో లభించిన ఈ గౌరవం తనకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగించిందని తెలిపారు.

వివరాలు

కళాకారులను గౌరవిస్తేనే కళ వర్ధిల్లుతుంది: పెమ్మసాని

ఇదే కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కళాకారులను గౌరవించినప్పుడే కళ వర్ధిల్లుతుందని, కళను కాపాడుకున్నప్పుడే సంస్కృతి పరిఢవిల్లుతుందని అన్నారు.

విజయవాడ ఉత్సవాల వంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న 'సరస్ మేళా-2026' గురించి పెమ్మసాని ప్రస్తావించారు.

ఈ మేళాలో సుమారు 1,500 మంది మహిళలు పాల్గొంటున్నారని తెలిపారు.

మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించడంలో భాగంగా రానున్న 15 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 15,000 మంది డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు

సరస్ మేళాను విజయవాడకు తీసుకురావడంపై ప్రశంసలు

ఈ కార్యక్రమంలో బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కూడా పాల్గొన్నారు.

దేశ రాజధాని ఢిల్లీ తర్వాత ప్రతిష్ఠాత్మకంగా భావించే సరస్ మేళాను విజయవాడకు తీసుకురావడంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక పాత్ర పోషించారని ఎంపీ కేశినేని శివనాథ్ ప్రశంసించారు.

మొత్తంగా విజయవాడ ఉత్సవాల వేదికగా రాఘవేంద్రరావు చేసిన సరదా వ్యాఖ్యలు సందడి సృష్టించగా, కళలు, సంస్కృతి పరిరక్షణతో పాటు మహిళలకు శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పనపై నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ADVERTISEMENT