Toxic: ప్రజలు ఆ విషయాన్ని గమనించాలి.. 'టాక్సిక్' టీజర్ వివాదంపై సెన్సార్ చీఫ్
ఈ వార్తాకథనం ఏంటి
యశ్ హీరోగా తెరకెక్కుతున్న 'టాక్సిక్' టీజర్ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సెన్సార్ బోర్డు) ఛైర్మన్ ప్రసూన్ జోషి స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వివాదంపై తాను ఎలాంటి స్పష్టమైన వ్యాఖ్యలు చేయలేనని తెలిపారు. అయితే ఈ సందర్భంగా డిజిటల్ మీడియాలో వస్తున్న కంటెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. 'టాక్సిక్ టీజర్ వివాదంపై ఈ దశలో నేను వ్యాఖ్యానించలేను. కానీ, ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలి. యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో మీరు చూసే అనేక వీడియోలకు సెన్సార్ సర్టిఫికేషన్ ఉండదు. అవి మా పరిధిలోకి రావు. ప్రజలు ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలి.
Details
ప్రతీ కంటెంట్ సెన్సార్ పరిధిలోకి రాదు
చూసే ప్రతీ కంటెంట్ సెన్సార్ పొందిందే అన్న భావన నుంచి బయటపడాలి. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో వచ్చే కంటెంట్‌కూ సెన్సార్ సర్టిఫికెట్ ఉందని చాలామంది భావిస్తారు. కానీ, అవి మా వద్దకు రావు. ఆ కంటెంట్‌కు సెన్సార్ ధ్రువీకరణ ఉండదని ప్రసూన్ జోషి స్పష్టం చేశారు. ఇటీవలి రోజులుగా వివాదాస్పదంగా మారిన మరో సినిమా 'జన నాయగన్' అంశంపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. ఆ చిత్రం ప్రస్తుతం చట్టపరమైన చిక్కుల్లో ఉందని, దీనిపై విచారణ కొనసాగుతోందని మాత్రమే వెల్లడించారు. కాగా, యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'టాక్సిక్'. 'ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్‌అప్స్' అనే ఉపశీర్షికతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను ఇటీవల విడుదల చేశారు.
Details
కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు
అయితే అందులో ఇంటిమేట్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో మహిళా కమిషన్ ఈ వివాదంపై స్పందించి, తగిన చర్యలు తీసుకొని నివేదిక సమర్పించాలని సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. ఈ వ్యవహారం ప్రస్తుతం మరింత చర్చనీయాంశంగా మారింది.