
Ponguleti Biopic: తెలంగాణ కాంగ్రెస్ మంత్రిపై బయోపిక్!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జీవితం ఆధారంగా ఓ బయోపిక్ రూపొందించబోతున్నారు. ఈ సినిమాకు 'శ్రీనన్న అందరివాడు' అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాత్రను ప్రముఖ సీనియర్ నటుడు సుమన్ పోషించనున్నారు. ఈ బయోపిక్‌లో ఆయన వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రయాణం, ముఖ్య ఘట్టాలను ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో పాటు దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలను బయ్యా వెంకట నర్సింహ రాజ్ స్వయంగా చేపడుతున్నారు. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
వివరాలు
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్
ఈ బయోపిక్‌ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషలతో పాటు అస్సామీలో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా శ్రీ వెంకట్ పనిచేస్తుండగా, పాటలను రచయిత కాసర్ల శ్యామ్ రాయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ పోస్టర్‌లో ఒక వైపు హీరో సుమన్ రూపం కనిపిస్తుండగా, మరొక వైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చిత్ర రూపంలో దర్శనమిచ్చారు. రాజకీయ ప్రయాణం విషయానికి వస్తే.. 2014 లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
వివరాలు
'తెలంగాణ జన గర్జన' సభలో కాంగ్రెస్ పార్టీలో చేరారు
అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరారు. 2018 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమలరాజుకు మద్దతు తెలిపారు. అయితే, 2023లో పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఆరోపణలతో ఆయనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. తరువాత, 2023 జూలైలో ఖమ్మంలో రాహుల్ గాంధీ సమక్షంలో జరిగిన 'తెలంగాణ జన గర్జన' సభలో కాంగ్రెస్ పార్టీకి చేరారు. అదే సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచి, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ మంత్రివర్గంలో మంత్రి హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.