
Baahubali The Beginning: ప్రభాస్ 'బాహుబలి'కి 10 ఏళ్లు.. ఆ ప్రశ్న ఇంకా కుదిపేస్తోంది!
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు చిత్ర పరిశ్రమకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం 'బాహుబలి' (Baahubali). ప్రభాస్, రానా దగ్గుపాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ వంటి నటులతో, జాతీయ స్థాయి దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కించారు. 2015, జూలై 10న విడుదలైన 'బాహుబలి: ది బిగినింగ్' సినీ ప్రేక్షకులపై అమోఘమైన ప్రభావం చూపింది. ప్రపంచవ్యాప్తంగా ఒక్క ప్రశ్నే ప్రతి ఒక్కరి నోటా వినిపించింది. 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్న. ఇప్పటికీ అది ఒక గుర్తుండిపోయే మలుపు. ఈ సినిమాలోని కొన్ని ఆసక్తికర విశేషాలు ఇప్పుడు ఓసారి చూద్దాం.
Details
మొదట అనుకున్న ఇంటర్వెల్ సన్నివేశం వేరే
ప్రస్తుతం సినిమాలో ఇంటర్వెల్ సన్నివేశం — బాహుబలి విగ్రహాన్ని శివుడు పైకి లేపే క్షణం. అయితే మొదట దర్శకుడు రాజమౌళి మరో విధంగా ఈ ఘట్టాన్ని రూపుదిద్దాలని అనుకున్నారు. మొదట మాహిష్మతిలోకి శివుడు పంచభూతాలను దాటి ప్రవేశించే సమయంలో, దేవసేన పలికే 'నా కొడుకు వచ్చాడు' అనే మాటలపై ఇంటర్వెల్ ఇవ్వాలని ఆలోచించారు. అదే సమయంలో బిజ్జలదేవుడు (నాజర్) బాహుబలి చనిపోయాడని చెప్పే ప్రతి వాక్యానికి ప్రతిస్పందనగా శివుడు మట్టి గోడను, అగ్నిని, నీటిని దాటి వచ్చేలా దృశ్యాలు ప్లాన్ చేశారు. కానీ చివరికి విగ్రహాన్ని పైకి లేపే క్లైమాక్సిక్ మోమెంట్‌ను ఇంటర్వెల్‌గా ఎంపిక చేశారు. "నిప్పులే శ్వాసగా" అనే పాటతో శివుడు మాహిష్మతికి అడుగుపెడుతుంటే సినిమా మూడో గేర్ ఎక్కింది.
Details
భళ్లాలదేవుడి పాత్రకు మొదట జేసన్ మమోవా?
బాహుబలి పాత్రకు ప్రభాస్‌ను ఎంచుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ భళ్లాలదేవుడి పాత్ర కోసం దర్శకదాండ్యం ఎన్నో పరిశోధనలు చేసింది. ఇందులో మొదట 'ఆక్వామెన్', 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ఫేమ్ హాలీవుడ్ నటుడు జేసన్ మమోవా పేరును పరిగణనలోకి తీసుకున్నారు. కానీ భారతీయంగానే ఉండే, ప్రభాస్‌కు సరిపోయే హైటు, బిల్డుతో రానా దగ్గుబాటి సరైన ఎంపికగా నిలిచాడు. నిర్మాత శోభు యార్లగడ్డ కథను వివరించగా ఈ పాత్రకు ముందు ఎవరి గురించి ఆలోచించారు?" అని అడిగిన రానాకు జేసన్ మమోవా పేరు చెప్పగా, ఆయన నవ్వుతూ వెంటనే ఒప్పుకున్నాడు.
Details
కట్టప్ప పాత్ర హైలెట్
కట్టప్ప పాత్రకు మొదట బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ పేరు పరిశీలనలో ఉంది. కానీ ఆయన అందుబాటులో లేకపోవడంతో సత్యరాజ్‌ను తీసుకున్నారు. కథకుడు విజయేంద్ర ప్రసాద్ ప్రకారం - ప్రభాస్‌తో సినిమా చేయాలనుకున్న రాజమౌళి, కథ ఇవ్వమని కోరాడు. మహిళలకూ పురుషులకు సమాన ప్రాధాన్యమున్న యాక్షన్ డ్రామా కావాలని చెప్పారు. అప్పుడే ఆయన కట్టప్ప పాత్రను సృష్టించారు. ఒక విదేశీయుడు భారతదేశంలోకి వచ్చి ఓ వృద్ధ ఖడ్గవీరుణ్ని కలుసుకుంటాడు. అతను 'బాహుబలి' అనే మహావీరుడి గురించి చెప్తాడు. కానీ చివరికి ఆ వృద్ధుడు తానే బాహుబలిని చంపాడని ఒప్పుకుంటాడు. అదే కథకు మొదటి మూడ్‌ను ఇచ్చింది.ఇది వినగానే రాజమౌళి కథ మొత్తం రాయమని చెప్పారు. ఆస్క్రిప్ట్ పూర్తి చేయడానికి నాలుగైదు నెలల సమయం పట్టింది.
Details
శ్రీదేవి స్థానంలో రమ్యకృష్ణ
శివగామి పాత్ర కోసం మొదట శ్రీదేవిని అనుకున్నట్లు వార్తలొచ్చాయి. కానీ చివరికి ఆ పాత్ర రమ్యకృష్ణకు దక్కింది. ఆమె పాత్ర సినిమాకు ప్రాణం ఇచ్చినట్టు మారింది. అలాగే కాలకేయ భాషగా 'కిలికిలి' అనే ప్రత్యేక భాషను సృష్టించడం కూడా 'బాహుబలి' విశిష్టతలో ఒకటి.
Details
మొదట నెగటివ్ టాక్.. తరువాత ప్రపంచ రికార్డులు
చిత్రం మొదట విడుదలైన రోజు నెగటివ్ టాక్‌తో ప్రారంభమైందని నిర్మాత శోభు స్వయంగా ఒక సందర్భంలో చెప్పారు. ఆ సమయంలో ప్రేక్షకులకు అలాంటి విజువల్స్ కొత్తగా అనిపించడంతో ముందుగా భిన్న స్పందనలు వచ్చాయి. కానీ మౌత్ పబ్లిసిటీతో సినిమా రోజు రోజుకు పెరిగిపోయి భారీ వసూళ్లను రాబట్టింది. తర్వాతి భాగంగా వచ్చిన 'బాహుబలి: ది కన్‌క్లూజన్' (2017)లో "బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?" అనే ప్రశ్నకు క్లైమాక్స్ సమాధానం వచ్చింది. మొత్తానికి, 'బాహుబలి' సినిమా కేవలం ఒక విజువల్ విజ్ఞానమే కాదు, భారతీయ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన చరిత్రాత్మక చిత్రం. ఇప్పుడు దాని తొలి భాగం విడుదలై 10 ఏళ్లు పూర్తవడం మరో మైలురాయి.