Rebel Star : 'కల్కి 2'కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్.. షూటింగ్ ఎప్పటి నుంచంటే?
ఈ వార్తాకథనం ఏంటి
'రాజాసాబ్' సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో విడుదలైంది. సినిమా హిట్-ఫ్లాప్ టాక్ ఎలా ఉన్నా, వింటేజ్ ప్రభాస్‌ను తెరపై చూశామని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా విషయాన్ని పక్కన పెడితే, ప్రభాస్ లైనప్‌లో ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ క్యూలో ఉన్నాయి. వాటిలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ 'కల్కి 2' ఒకటి. గతేడాది 2024లో విడుదలైన 'కల్కి' మూవీ వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘన విజయం అందుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో రెండో వెయ్యి కోట్ల సినిమాగా నిలిచింది. దీంతో 'కల్కి' రెండో భాగం ఎప్పుడు మొదలవుతుందనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది.
Details
సెట్స్ పై రెండు భారీ సినిమాలు
ప్రస్తుతం ప్రభాస్ రెండు సినిమాలు ఒకేసారి సెట్స్‌పై ఉన్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫౌజీ' షూటింగ్ జెట్ స్పీడ్‌లో సాగుతుండగా, తాజాగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న 'స్పిరిట్' షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఒకేసారి ఈ రెండు భారీ సినిమాల షూటింగ్‌ను హ్యాండిల్ చేస్తూనే ప్రభాస్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు 'కల్కి 2' కోసం కూడా డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే 'కల్కి' సెకండ్ పార్ట్‌ను ప్రారంభించగా, పార్ట్ వన్ సమయంలోనే కొంతమేర షూటింగ్ కూడా పూర్తి చేశారు. 'రాజాసాబ్' పనులు ముగించుకున్న ప్రభాస్ ఫిబ్రవరి నుంచి 'కల్కి 2' సెట్స్‌లో అడుగుపెట్టనున్నాడు.
Details
బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాలతో బీజీ
ఈ సెకండ్ పార్ట్‌లో విఎఫ్‌ఎక్స్ వర్క్‌కు భారీ సమయం అవసరం ఉండటంతో, ముందుగానే ప్రభాస్‌పై కీలక సన్నివేశాలను షూట్ చేసి, సీజీ పనులను ప్రారంభించాలనే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారు. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా, బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాలు చేస్తూ దూసుకెళ్తున్న ప్రభాస్.. ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో బిజియెస్ట్ స్టార్‌గా కొనసాగుతున్నాడనే చెప్పాలి.