The Raja Saab: ప్రభాస్ 'ది రాజాసాబ్' రన్‌టైమ్ ఖరారు.. స్పెషల్ ప్రీమియర్స్‌కు సన్నాహాలు
ఈ వార్తాకథనం ఏంటి
మూడు గంటల రన్‌టైమ్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలకు సాధారణంగా మారింది. ఈ ధోరణిలో అగ్ర కథానాయకుడు ప్రభాస్ మరోసారి ముందంజలో నిలిచారు. 'బాహుబలి'తర్వాత ఆయన నటించిన చిత్రాలన్నీ ఇదే నిడివితో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ ఫాంటసీ థ్రిల్లర్ 'ది రాజాసాబ్' కూడా అదే బాటలో సాగనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రన్‌టైమ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 3గంటలు 9నిమిషాల నిడివితో 'ది రాజాసాబ్' ప్రేక్షకులను ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లనుంది. అయితే సినిమాలోని ఒక తల నరికే సన్నివేశానికి సెన్సార్ బోర్డు కట్ సూచించింది.
Details
స్పెషల్ ప్రీమియర్స్‌కు సన్నాహాలు
జనవరి 9న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకు, ఒక రోజు ముందే అంటే జనవరి 8 రాత్రి స్పెషల్ ప్రీమియర్ షోలను నిర్వహించేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అనుమతుల కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు దరఖాస్తు చేసింది. తెలంగాణలో ఉదయం 4 గంటల షోకు కూడా అనుమతి ఇవ్వాలని కోరింది. స్పెషల్ ప్రీమియర్ టికెట్ల ధరలను సింగిల్ స్క్రీన్‌లలో రూ.800, మల్టీప్లెక్స్‌లలో రూ.1000 (పన్నులతో కలిపి)గా నిర్ణయించేందుకు అనుమతి కోరింది. అలాగే జనవరి 9 నుంచి 11 వరకూ సింగిల్ స్క్రీన్‌లలో రూ.105, జనవరి 12 నుంచి 18 వరకూ రూ.62 (పన్నులతో కలిపి) టికెట్ ధర పెంచుకునే వెసులుబాటు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
Details
కథానాయికలుగా మాళవిక మోహనన్, రిద్ధికుమార్, నిధి అగర్వాల్
మల్టీప్లెక్స్‌లలో వరుస తేదీల్లో రూ.132, రూ.89 పెంచుకునేలా అనుమతి కోరింది. ఈ అంశంపై త్వరలోనే సినిమాటోగ్రఫీ శాఖ అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే బుకింగ్స్ ఓపెన్ అయ్యే అవకాశముందని సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, రిద్ధికుమార్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటిస్తుండగా, సంజయ్ దత్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే యువతను ఆకట్టుకుంటున్నాయి.