హాలీవుడ్ లో రామ్ చరణ్ క్రేజ్: అమెరికా టాక్ షోలో అతిథిగా రామ్ చరణ్
రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. 6వ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి అతిథిగా, అవార్డు ప్రెజెంట్ చేయడానికి వెళ్లారు. ఈ అవార్డుల ప్రధానోత్సవం, ఫిబ్రవరి 24వ తేదీన లాస్ ఏంజిల్స్ లో జరగనుంది. ఇదిలా ఉంటే తాజాగా రామ్ చరణ్, అమెరికాలో పేరుగాంచిన టాక్ షోలో దర్శనమివ్వబోతున్నాడు. గుడ్ మార్నింగ్ అమెరికా అనే టాక్ షోలో రామ్ చరణ్ మాట్లాడనున్నారు. ఆర్ఆర్ఆర్ అనుభవాలను, తన తర్వాతి సినిమా విశేషాలను ఈ ప్రోగ్రామ్ లో పంచుకోనున్నాడు. ఈ ప్రోగ్రామ్ ఈరోజు రాత్రి 11:30గంటలకు ఏబిసీ ఛానెల్ లో ప్రసార కానుంది. హాలీవుడ్ తారలైన టామ్ క్రూజ్, లియోనార్డో డికాప్రియో మొదలగు వారు ఈ టాక్ షోకి ఇంతకుముందు హాజరయ్యారు.
ఆనందంలో రామ్ చరణ్ అభిమానులు
గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలో రామ్ చరణ్ వస్తున్నాడని తెలియడంతో అభిమానులు ఆనందంలో ఉన్నారు. రామ్ చరణ్ అందుకుంటున్న గౌరవానికి సంబరపడుతున్నారు. ఇదిలా ఉంచితే, మార్చ్ 13వ తేదీన ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఆర్ఆర్ఆర్ బృందం హాజరు కానుంది. ఉత్తమ పాట విభాగంలో నామినేషన్లలో నిలిచిన నాటునాటు పాట కోసం ఆర్ఆర్ఆర్ టీమ్ అంతా వస్తున్నట్టు సమాచారం. అదీగాక ఆస్కార్ స్టేజి మీద కీరవాణీతో నాటు నాటు పాట లైవ్ పర్ఫార్మెన్స్ ఉండనుందని తెలుస్తోంది. అదే జరిగితే తెలుగు సినిమా స్థాయి మరింత పెరుగుతుందని ఆశిస్తున్నారు. ఆల్రెడీ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న ఆర్ఆర్ఆర్, ఆస్కార్ అందుకుని సరికొత్త చరిత్ర సృష్టిస్తుందేమో చూడాలి.