రానా హిరణ్య కశ్యప వివాదం: త్రివిక్రమ్ వర్సెస్ గుణశేఖర్; అసలేం జరుగుతోంది?
ప్రాజెక్ట్ కె టీమ్ తో పాటు అమెరికాలో ఉన్న రానా దగ్గుబాటి, హిరణ్య కశ్యప చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అమర చిత్ర కథల నుండి స్ఫూర్తి పొంది తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ రచయితగా పనిచేస్తున్నారు. దర్శకుడిగా ఎవరు చేస్తున్నారనేది ఇంకా వెల్లడి చేయలేదు. గతంలో రుద్రమదేవి సినిమా పూర్తికాగానే రానాతో హిరణ్య కశ్యప సినిమాను గుణశేఖర్ ప్రకటించారు. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో ఈ సినిమా ఉంటుందని అన్నారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఈ సినిమా పట్టాలెక్కలేదు. రుద్రమదేవి తర్వాత మళ్ళీ ఇన్ని రోజులకు హిరణ్య కశ్యప సినిమాపై అప్డేట్ వచ్చింది. అయితే ఈ సినిమాకు త్రివిక్రమ్ పనిచేయడం, గుణశేఖర్ ను తప్పించడం వివాదంగా మారుతోంది.
హిరణ్య కశ్యప సినిమాపై గుణశేఖర్ మాటలు
గతంలో శాకుంతలం ప్రమోషన్స్ లో గుణశేఖర్ మాట్లాడుతూ, హిరణ్య కశ్యప సినిమాను వేరే దర్శకుడు చేస్తున్నాడని తెలిసిందనీ, నా కథకు ఆ కథకు సంబంధం లేకపోతే ఫర్వాలేదనీ, హిరణ్య కశ్యప కథను ఇంకోలా తీసుకుంటే నష్టం లేదనీ, నా కథనే సినిమా తీసుకొస్తే నేను ఊరుకోనని అన్నారు. ఇప్పుడు హిరణ్య కశ్యప సినిమాపై అప్డేట్ రావడంతో గుణశేఖర్ మాటలు వైరల్ అవుతున్నాయి. మరి త్రివిక్రమ్ రచనా సహకారంతో తెరకెక్కే హిరణ్య కశ్యప సినిమా, వివాదాలకు దారి తీస్తుందా లేదా అన్నది చూడాలి.