Rani Mukerji: షారుఖ్ ఖాన్ తర్వాత రాణీ ముఖర్జీకి లా ట్రిబో యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ ప్రముఖ నటి రాణీ ముఖర్జీకి తన సినీ ప్రయాణంలో మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని ప్రముఖ లా ట్రోబ్ యూనివర్సిటీ ఆమెకు గౌరవ డాక్టరేట్ (డాక్టర్ ఆఫ్ లెటర్స్)ను ప్రదానం చేసింది. భారతీయ సినిమాతో పాటు సమాజ సేవలో దాదాపు మూడు దశాబ్దాలుగా ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందించింది. గతంలో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌కు ఇదే విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను అందించింది. ఇప్పుడు రాణీ ముఖర్జీ కూడా ఈ గౌరవాన్ని అందుకోవడంతో.. లా ట్రోబ్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన రెండో భారతీయ సినీ ప్రముఖురాలిగా ఆమె నిలిచారు.
వివరాలు
మెల్‌బోర్న్‌లో పురస్కార ప్రదానం
మెల్‌బోర్న్‌లో జరుగుతున్న 'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్' (ఐఎఫ్ఎఫ్‌ఎం) 2026 వేడుకల్లో భాగంగా ఫెడరేషన్ స్క్వేర్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాణీ ముఖర్జీకి గౌరవ డాక్టరేట్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా పురస్కారాన్ని స్వీకరించిన ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
"లా ట్రోబ్ యూనివర్సిటీ నుంచి ఈ గౌరవ డాక్టరేట్ అందుకోవడం నా జీవితంలోని అత్యంత వినయపూర్వకమైన క్షణాల్లో ఒకటి. చిన్నతనంలోనే నా కుటుంబాన్ని, నా దేశాన్ని గర్వపడేలా చేయాలని కలలు కన్నాను. ఆ కలను సాకారం చేసుకునేందుకు సినిమా ఒక మాధ్యమంగా మారింది" అని రాణీ ముఖర్జీ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
వివరాలు
హృదయాన్ని తాకిన కథలకే ప్రాధాన్యం
తాను కెరీర్ ప్రారంభించినప్పటి నుంచే విభిన్నమైన ప్రయత్నాలు చేసేందుకు, రిస్క్ తీసుకునేందుకు వెనుకాడలేదని రాణీ తెలిపారు.
తన మనసుకు నచ్చిన, హృదయాన్ని తాకే కథలనే ఎంచుకున్నానని చెప్పారు. "స్ఫూర్తినిచ్చే, సాధికారతను పెంచే కథలను చెప్పాలనుకున్నాను.
భారతీయ మహిళల్లో ఉన్న శక్తి, సామర్థ్యాన్ని నా సినిమాల ద్వారా నిశ్శబ్దంగా ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రయత్నించాను" అని ఆమె వివరించారు.
వివరాలు
భారత్‌కు, ప్రేక్షకులకు అంకితం
తనకు లభించిన గౌరవాన్ని వ్యక్తిగత విజయంగా మాత్రమే చూడటం లేదని రాణీ ముఖర్జీ అన్నారు.
ఈ డాక్టరేట్ యావత్ భారతదేశానికి, ప్రపంచవ్యాప్తంగా తనను ఆదరించే ప్రేక్షకులకు అంకితమని తెలిపారు.
"ఈ డాక్టరేట్‌ను భారత్‌కు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా ప్రేక్షకులకు అంకితం చేస్తున్నాను. ఒక కళాకారుడిగా నటనతో మన బాధ్యత ముగియదు. మనం మన సంస్కృతికి రాయబారులుగా మారతాం" అని రాణీ పేర్కొన్నారు.
వివరాలు
సామాజిక అంశాలపై చర్చకు కారణమయ్యారు: జాన్ బ్రంబీ
లా ట్రోబ్ యూనివర్సిటీ ఛాన్సలర్ జాన్ బ్రంబీ రాణీముఖర్జీ సేవలను ప్రశంసించారు.
ఆమె తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించడంతో పాటు సామాజిక న్యాయం, సమానత్వం వంటి కీలక అంశాలపై చర్చకు దారితీశారని అన్నారు.
మానవతావాద కార్యక్రమాల పట్ల రాణీ ముఖర్జీకి ఉన్న నిబద్ధత కూడా ఆమెను ఈ గౌరవానికి అత్యంత అర్హురాలిగా నిలిపిందని జాన్ బ్రంబీ పేర్కొన్నారు.
2019లో షారుఖ్ ఖాన్‌కు ఇదే గౌరవం
కాగా,లా ట్రోబ్ యూనివర్సిటీ 2019లో షారుఖ్ ఖాన్‌కు గౌరవ డాక్టరేట్‌ను అందించింది.
సినిమారంగంతో పాటు సామాజికసేవలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం ఇచ్చింది.
ఇప్పుడు రాణీ ముఖర్జీకి కూడా ఇదే విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ అందించడంతో బాలీవుడ్‌కు మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించినట్లైంది.