
Actress Ramya: అత్యాచార బెదిరింపులు అమానుషం.. నటి రమ్యకు మద్దతుగా శివరాజ్‌కుమార్!
ఈ వార్తాకథనం ఏంటి
కన్నడ సినీ నటి, రాజకీయ నాయకురాలు రమ్య (దివ్య స్పందన)ఇటీవల ప్రముఖ నటుడు 'దర్శన్' అభిమానుల నుండి తాను ఎదుర్కొంటున్న ఆన్‌లైన్ వేధింపులపై ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా తనకు వస్తున్న అశ్లీల సందేశాలు, బెదిరింపులు, అసభ్య చిత్రాలు మొదలైన వాటి స్క్రీన్‌షాట్లను సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు. అంతేగాక, నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్‌కి కూడా ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. నటి పవిత్రా గౌడపై చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి చేసిన వ్యాఖ్యలకూ దర్శన్ అభిమానులు తనకు పంపుతున్న సందేశాలకూ తేడా లేదని రమ్య మండిపడ్డారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని విపరీతమైన స్త్రీ ద్వేషాన్ని ప్రసారం చేస్తున్న వారే ఈ వేధింపులకు కారణమని ఆమె అభిప్రాయపడ్డారు.
Details
మహిళను అవమానపరచడం అన్యాయం
ఈ వివాదంపై రమ్యకు మద్దతుగా కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ నిలిచారు. రమ్యకు వ్యతిరేకంగా వస్తున్న పోస్టులు, వాడిన పదాలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ మహిళ పైనా ఇలాగే మాట్లాడటం అసహ్యకరం. మహిళల్ని తల్లిగా, అక్కగా, కూతురిగా మాత్రమే కాకుండా వ్యక్తిగా గౌరవించడం అత్యంత అవసరం. సోషల్ మీడియా అనేది అభిప్రాయాల కోసం ఉపయోగపడాలి. ద్వేషపూరిత, అసభ్య పదజాలానికి ఇది వేదిక కావద్దు. నీవు ఎంచుకున్న మార్గం సరైనదే రమ్య... నీకు మేమంతా తోడుగా ఉంటాం అంటూ ఆయన ఎక్స్ (ట్విటర్) వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఇక అసలు వివాదం ఎలా మొదలైందంటే... ఇటీవల రేణుకాస్వామి హత్య కేసుపై రమ్య ఒక పోస్టు పెట్టారు.
Details
ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదు
ఆ పోస్టుకు నిరసనగా దర్శన్ అభిమానులు తనను టార్గెట్ చేయడం ప్రారంభించారు. రేణుకాస్వామి బదులు నిన్ను హత్య చేయాలి. నిన్ను అత్యాచారం చేస్తాం" అనే వాక్యాలతో అశ్లీల, హింసాత్మక మెసేజ్‌లు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు పంపినట్లు ఆమె వెల్లడించారు. ఆ స్క్రీన్‌షాట్లను కూడా తన ఇన్‌స్టా స్టోరీల ద్వారా పంచుకున్నారు. తన కుటుంబ సభ్యులకూ ఈ వేధింపులు విస్తరించాయని బాధను వ్యక్తపరిచిన రమ్య, ఇటువంటి పరిస్థితులు ఆడపిల్లల రక్షణపై మన సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు. తెలుగు ప్రేక్షకులకు 'అభిమన్యు' సినిమాతో పరిచయమైన రమ్య ప్రస్తుతం రాజకీయ రంగంలో చురుకుగా ఉన్నారు.