Rapo 22: రాపో 22 అప్‌డేట్.. మీకు సుపరిచితుడు.. మీలో ఒకడు వచ్చే టైం ఫిక్స్
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం రాపో 22 (RAPO 22). "మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి" చిత్రంతో గుర్తింపు పొందిన దర్శకుడు పీ మహేశ్ బాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో "మిస్టర్ బచ్చన్" ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే మహిళా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. రామ్ టీం ప్రతిరోజూ ఏదో ఒక ఆసక్తికరమైన వార్తను అభిమానులతో పంచుకుంటూ వారిని ఉత్సాహపరుస్తోంది.
ఆసక్తిని పెంచిన రామ్ సైకిల్‌పై వెళ్తున్న లుక్
తాజాగా, "మీలో ఒకడిని" డిసెంబర్ 6న ఉదయం 10:08 గంటలకు పరిచయం చేయనున్నట్లు ప్రకటించారు. రామ్ సైకిల్‌పై వెళ్తున్న లుక్‌ను ఒక టీజర్‌లా విడుదల చేసి, అందరిలో ఆసక్తిని రేకెత్తించారు. ఈ అప్‌డేట్ చూస్తుంటే రామ్ ఈసారి ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌తో కోలీవుడ్ సంగీత దర్శకుల ద్వయం వివేక్-మెర్విన్ టాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నారు. అలాగే, "మేరి క్రిస్మస్," "మలైకొట్టై వాలిబన్" వంటి విజయవంతమైన చిత్రాలకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ మధు నీలకందన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. మరోవైపు నేషనల్ అవార్డు గ్రహీత, ప్రముఖ ఎడిటర్ అక్కినేని శ్రీకర్ ప్రసాద్ ఈ చిత్రానికి పనిచేస్తుండటం కూడా అంచనాలను మరింత పెంచుతోంది.