Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక మందన్న.. క్రేజీ కాంబోపై బజ్!
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ సంగీత ప్రపంచంలో తన దివ్యమైన గాత్రంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న గానకోకిల, భారతరత్న 'ఎమ్మెస్ సుబ్బులక్ష్మి' జీవిత కథ ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ఆమె జీవిత ఆధారంగా ఓ భారీ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. భారతీయ సంగీత సామ్రాజ్యపు మహారాణిగా గుర్తింపు పొందిన ఎమ్మెస్ సుబ్బులక్ష్మి జీవిత చరిత్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు సినీ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌లో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పాత్రలో 'నేషనల్ క్రష్' రష్మిక మందన్న నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. 'జెర్సీ' వంటి క్లాసిక్ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.
వివరాలు
భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు ప్లాన్
ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాస్, కన్నడ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ సంయుక్తంగా ఈ ల్యాండ్‌మార్క్ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పాత్ర కోసం రష్మిక మందన్నకు సీక్రెట్‌గా లుక్ టెస్ట్ కూడా నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. సంప్రదాయబద్ధమైన గెటప్‌లో రష్మిక లుక్‌ను చూసిన మేకర్స్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
క్లాసికల్ ఐకాన్ ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పాత్రలో రష్మిక నటించడం ఆమె కెరీర్‌లోనే ఓ ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచిపోతుందని భావిస్తున్నారు.
అల్లు అరవింద్, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు, అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
వివరాలు
ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న సాయి పల్లవి
అయితే ఈ సినిమాలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పాత్ర కోసం మొదట సాయి పల్లవి పేరు వినిపించింది. కానీ అనుకోని కారణాలతో సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఆ పాత్రలో రష్మికను తీసుకోవాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.