శ్రీవల్లి క్యారెక్టర్ పై వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన ఐశ్వర్యా రాజేష్: స్పందించిన రష్మికా మందన్నా
పుష్ప సినిమాలోని శ్రీవల్లి క్యారెక్టర్ పై ఐశ్వర్య రాజేష్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో చర్చకు దారితీసాయి. రష్మిక అభిమానులు ఈ విషయంలో ఐశ్వర్య రాజేష్ ను తప్పుపట్టారు. తాజాగా ఈ విషయమై వివరణ ఇచ్చింది ఐశ్వర్య రాజేష్. ఈ వివరణపై రష్మిక మందన్న స్పందిస్తూ, ఐశ్వర్య వివరణ తన దాకా వచ్చిందనీ, ఐశ్వర్య మాటలను తాను అర్థం చేసుకున్నానని, ఐశ్వర్య మీద తనకు ఇష్టం, గౌరవం ఉన్నాయని అంది. అలాగే ఐశ్వర్య ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతూ ఐశ్వర్య కొత్త చిత్రం ఫర్హానా.. మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేసింది రష్మిక. ప్రస్తుతం రష్మిక మందన్న సమాధానం ఇంటర్నెట్లో వైరల్ గా మారుతోంది.
అసలు ఐశ్వర్య రాజేష్ రష్మిక గురించి ఏం మాట్లాడింది?
తాను నటించిన ఫర్హానా చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న ఐశ్వర్యా, ఒకానొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్ర తనకు బాగా నచ్చిందని, ఆ పాత్ర తనకు బాగా సూట్ అవుతుందని అంది. శ్రీవల్లి పాత్రలో రష్మిక చాలా బాగా చేసిందని మాట్లాడింది. అలాగే, అలాంటి పాత్ర చేసే అవకాశం వస్తే బాగుండేదని, అలాంటి పాత్రలో మరింత బాగా నటించే అవకాశం దొరుకుతుందని ఆమె అంది. ఆమె ఆఖర్లో అన్న పదాలే ఇంటర్నెట్ లో వైరల్ గా మారిపోయి ఇక్కడ వరకు తీసుకొచ్చాయి. ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ వివరణకు రష్మిక మందన్న పాజిటివ్ గా సమాధానం ఇచ్చింది కాబట్టి ఇకపై ఈ గొడవకు పుల్ స్టాప్ పడినట్టే అని అర్థం చేసుకోవచ్చు.