The Girlfriend Review: రివ్యూ: ది గర్ల్‌ఫ్రెండ్.. రష్మిక కొత్త చిత్రం ఎలా ఉంది?
ఈ వార్తాకథనం ఏంటి
ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల్లో ప్రధానమైనది 'ది గర్ల్‌ఫ్రెండ్'. ప్రధాన పాత్రలో రష్మిక మందన్న నటించడం, గీతా ఆర్ట్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించడం, మంచి ప్రమోషన్ జరగడం వంటివి ప్రేక్షకుల దృష్టిని ఈ సినిమా వైపు ఆకట్టుకున్నాయి. కానీ, ఈ చిత్రం వాస్తవానికి ఎలా ఉంది? ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని పంచింది? ఇప్పుడు చూద్దాం..
వివరాలు
కథేంటంటే..
భూమా దేవి అలియాస్ భూమా(రష్మిక మందన్న),విక్రమ్(దీక్షిత్ శెట్టి)ఇద్దరూ పీజీ చేసే విద్యార్థులు. ఒకే కాలేజీలో ఉన్నప్పటికీ వేర్వేరు కోర్సులు చదువుతుంటారు.మొదటి పరిచయంలోనే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం మొదలవుతుంది. త్వరలోనే బాయ్‌ఫ్రెండ్,గర్ల్‌ఫ్రెండ్‌లుగా మారిపోతారు.విక్రమ్‌ని దుర్గ(అను ఇమ్మానుయేల్)కూడా ఇష్టపడుతుంది. కానీ విక్రమ్ మాత్రం భూమానే ప్రేమిస్తాడు.కారణం.. భూమా తనని అమ్మలా చూసుకునే అమ్మాయని. ఆ మాటే భూమా హృదయాన్ని మరింతగా కదిలిస్తుంది. అయితే, ప్రేమ ప్రయాణంలో ఒకరి గురించి మరొకరు లోతుగా తెలుసుకుంటూ ముందుకు సాగే సమయంలో.. ఏదో ఒక సంఘర్షణ మొదలవుతుంది. ఆ బంధంలో వచ్చే మార్పు ఏమిటి? భూమా ఎటువంటి ఆలోచనతో ఈ ప్రేమకి కొంత విరామం కావాలని చెప్పింది? చివరకు వారి ప్రేమ నిలిచిందా? లేదా? తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
వివరాలు
ఎలా ఉందంటే...
సాధారణంగా ప్రేమకథల్లో హీరో-హీరోయిన్ అడ్డంకులను దాటుకుని కలిసే సన్నివేశాలే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. కానీ ఈ చిత్రంలో మాత్రం హీరోయిన్ ప్రేమకు బ్రేకప్ చెప్పే సన్నివేశంలోనే థియేటర్‌లో చప్పట్ల గోల వినిపిస్తుంది. అంటే కథ ఏ దిశలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రం ద్వారా తప్పు బంధాలు, అపరిణిత ప్రేమలు, మనసుకు బరువయ్యే సంబంధాలు ఎలా ఉంటాయో చూపించారు. బంధాల విషయంలో ఎంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలో చెప్పకనే చెబుతుందీ చిత్రం. మొదట్లో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగినప్పటికీ, భూమా-విక్రమ్ ప్రేమలో నిజమైన ప్రయాణం మొదలయ్యాక సినిమా ప్రేక్షకుడిని తనలో లాగేస్తుంది.
వివరాలు
ఎలా ఉందంటే...
ప్రారంభ పరిచయాలు సాధారణ ప్రేమ కథలా కనిపిస్తాయి.కానీ విక్రమ్ పాత్ర ప్రవర్తన కథను క్రమంగా మరింత సీరియస్ దిశగా మలుస్తుంది. ప్రేమ పేరుతో ఏర్పడే ఆధారాలు, నియంత్రణ, ఒత్తిడులు-వాటి వల్ల హీరోయిన్ మానసికంగా ఎలా బాధపడుతుందో వచ్చే సన్నివేశాలు బలంగా ఆకట్టుకుంటాయి. ఇంటి పరిచయం సన్నివేశాలు,ఇంటర్వల్ ఎపిసోడ్ చాలా బాగా తెరకెక్కించారు. రెండో భాగంలో హీరోయిన్ తండ్రి నేపథ్యంతో వచ్చే కొన్ని సన్నివేశాలు కొంచెం ఊహాత్మకంగానే ఉన్నప్పటికీ, క్లైమాక్స్ మాత్రం చిత్రానికి కీలకమైన శక్తి. వేదికపై భయపడే అమ్మాయి చివరికి అదే వేదిక మీద నిలబడి ఒక విస్ఫోటనాన్ని గుర్తు చేస్తుంది. షరతులు లేని ప్రేమే జీవితాన్ని,అందులోని అందాన్ని సజీవంగా నిలుపుతుందని ఈ కథతో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్.
వివరాలు
ఎవరెలా చేశారంటే..
రష్మిక మందన్న భూమా పాత్రకు జీవం పోశారు. క్షణాల్లో భావాల మార్పును ఆమె అద్భుతంగా వ్యక్తీకరించారు. ఆమె నటన ఈ సినిమాకే ప్రధాన బలం. దీక్షిత్ శెట్టి మొదటి భాగంలో స్టైలిష్‌గా కనిపిస్తాడు. రెండో భాగంలో మాత్రం తన పాత్రలోని అహంకారం, స్వార్థం స్పష్టంగా బయటపడేలా ప్రదర్శించారు. అను ఇమ్మానుయేల్ ఆకట్టుకునే పాత్రలో అందంగా నటించారు. రావు రమేష్, రోహిణి పాత్రలు చిన్నవైనా కథకు బలమైన మద్దతు నిచ్చాయి. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ చిన్న పాత్రలో నటించినప్పటికీ, రచయితగా, దర్శకుడిగా ఎక్కువ మార్కులు అందుకున్నారు.
వివరాలు
సాంకేతిక విభాగాలు
సంగీతం, నేపథ్య స్కోర్, సాహిత్యం, సినిమాటోగ్రఫీ అన్నీ కథ భావానికి అనుగుణంగా బాగానే పనిచేశాయి. ప్రత్యేకంగా BGM కొన్ని సన్నివేశాల్లో భావోద్వేగాన్ని మరింత బలంగా చేస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా కనిపిస్తాయి. మొత్తం మీద..'ది గర్ల్‌ఫ్రెండ్' ప్రేమ అనే పేరుతో ఏర్పడే విషపూరిత సంబంధాల విలువను గుర్తుచేసే చిత్రం. భావోద్వేగాలకు పెద్ద ప్రాధాన్యత కలిగిన, ఆలోచన రేకెత్తించే కథల్ని ఇష్టపడేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.