Ravi Teja: మాస్ హీరో రూటు మార్చాడు.. థ్రిల్లర్‌తో వస్తున్న రవితేజ
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో కథపై పూర్తి నమ్మకంతో సినిమాలు తెరకెక్కించే దర్శకుల్లో శివ నిర్వాణ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండతో కలిసి తెరకెక్కించిన ఖుషి చిత్రం సంగీత పరంగా మంచి విజయాన్ని సాధించి మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. అయితే, ప్రేక్షకుల నుంచి వచ్చిన అంచనాలకు మాత్రం ఆ సినిమా పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయింది. బాక్సాఫీస్ పరంగా పెద్ద విజయం సాధించకపోయినా,పాటలు మాత్రం బాగా ఆదరణ పొందాయి. ఈ సినిమా అనంతరం శివ నిర్వాణ, ప్రముఖ నటుడు రవితేజతో ఓ కొత్త చిత్రాన్ని తెరకెక్కించనున్నారనే వార్తలు ఇప్పటికే సోషల్ మీడియా, ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. థ్రిల్లర్ జానర్‌లో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ 2026 ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.
వివరాలు
హీరోయిన్‌గా ప్రియా భవానీ శంకర్
ఈ చిత్రానికి 'ఇరుముడి' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని తాజాగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తన కూతురిని రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళ్లే తండ్రి చుట్టూ తిరిగే కథ నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతుందని ఇన్‌సైడ్ టాక్. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియా భవానీ శంకర్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. అధికారిక ప్రకటన మేకర్స్ నుంచి వెలువడాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. రవితేజ అంటే మాస్ ఇమేజ్, ఎనర్జిటిక్ డ్యాన్స్‌లతో పాటు యాక్షన్, కామెడీ, రొమాన్స్ వంటి అనేక అంశాల కలయిక అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
వివరాలు
మైత్రీ మూవీ మేకర్స్ - రవితేజ కాంబినేషన్‌లో అమర్ అక్బర్ ఆంటోనీ
అయితే ఈ సారి ఆయన పూర్తిగా భిన్న మార్గాన్ని ఎంచుకుని థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. దీంతో ఈ సినిమాపై ఆడియన్స్‌లో మరింత ఆసక్తి నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్ - రవితేజ కాంబినేషన్‌లో ఇప్పటికే అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఇదే నిర్మాణ సంస్థలో శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి కూడా తెరకెక్కింది. ఇప్పుడు ఈ ముగ్గురి కలయిక మరొకసారి సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో, ఈ కాంబినేషన్ ఎలాంటి హిట్ అందుకుంటుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.