Loading...
RBI Repo Rate: ఆర్‌బీఐ మరోసారి వడ్డీ రేట్లు పెంచే ఛాన్స్.. 75 బేసిస్ పాయింట్ల హైక్‌పై అంచనా!
ఆర్‌బీఐ మరోసారి వడ్డీ రేట్లు పెంచే ఛాన్స్.. 75 బేసిస్ పాయింట్ల హైక్‌పై అంచనా!

RBI Repo Rate: ఆర్‌బీఐ మరోసారి వడ్డీ రేట్లు పెంచే ఛాన్స్.. 75 బేసిస్ పాయింట్ల హైక్‌పై అంచనా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 18, 2026
06:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక వడ్డీ రేటును మరో 75 బేసిస్‌ పాయింట్లు పెంచే అవకాశం ఉందని గోల్డ్‌మన్‌ శాక్స్‌ రీసెర్చ్‌ నివేదిక అంచనా వేసింది. 2027 క్యాలెండర్‌ సంవత్సరం రెండో త్రైమాసికం నాటికి ఈ పెంపు చేపట్టొచ్చని వెల్లడించింది. పెరుగుతున్న ఆహార ధరలు, విస్తరిస్తున్న ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల కారణంగా ఆర్‌బీఐ కఠిన ద్రవ్య విధానాన్ని అనుసరించవచ్చని అభిప్రాయపడింది. ఒకవేళ వడ్డీ రేట్లు పెరిగితే రుణాలపై వడ్డీ భారం పెరుగుతుంది. అదే సమయంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది.

వివరాలు

డిసెంబర్‌లో మరో 25 బేసిస్‌ పాయింట్ల పెంపు?

అక్టోబర్‌ నెలలో జరిగిన ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్లు పెంచింది.

దాదాపు నాలుగేళ్ల తర్వాత తొలిసారి వడ్డీ రేట్ల పెంపు చేపట్టింది.

డిసెంబర్‌లో జరగనున్న ఎంపీసీ సమావేశంలోనూ మరో 25 బేసిస్‌ పాయింట్లు పెంచే అవకాశం ఉందని గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా వేసింది.

2027 తొలి అర్ధభాగంలో మరో 50 బేసిస్‌ పాయింట్ల పెంపు ఉండొచ్చని తెలిపింది. దీంతో రెపో రేటు 6.25 శాతానికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది.

వివరాలు

6 శాతానికి పైనే రిటైల్‌ ద్రవ్యోల్బణం

ప్రస్తుత క్యాలెండర్‌ సంవత్సరం చివరి త్రైమాసికంతో పాటు వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోనూ రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతానికి పైనే ఉండొచ్చని గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా వేస్తోంది.

ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ కఠిన వైఖరికే మొగ్గు చూపుతుందని అభిప్రాయపడింది. వచ్చే క్యాలెండర్‌ సంవత్సరంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం సగటున 5.7 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

అక్టోబర్‌ నెలలో ఆర్‌బీఐ నిర్దేశించుకున్న లక్షిత స్థాయి అయిన 6 శాతాన్ని మించి ద్రవ్యోల్బణం నమోదైందని గోల్డ్‌మన్‌ శాక్స్‌ చీఫ్‌ ఇండియా ఎకనామిస్ట్‌ శంతను సేన్‌గుప్తా తెలిపారు.

రాబోయే రెండు త్రైమాసికాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చని పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు

పెట్టుబడులు, వినియోగంపై ప్రభావం

ఆర్‌బీఐ కఠిన ద్రవ్య విధాన నిర్ణయాలు తీసుకుంటే కార్పొరేట్‌ సంస్థల రుణ వ్యయాలు పెరుగుతాయని గోల్డ్‌మన్‌ శాక్స్‌ తెలిపింది.

మరోవైపు పన్ను తగ్గింపుల ప్రభావం కూడా క్రమంగా తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ఈ పరిణామాలు పెట్టుబడులు, వినియోగం వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని అంచనా వేసింది.

వచ్చే ఏడాది భారత జీడీపీ వృద్ధి 7.2 శాతంగా ఉండొచ్చని గోల్డ్‌మన్‌ శాక్స్‌ వెల్లడించింది.

ADVERTISEMENT