RC15 : పాటకు పదికోట్లు ఖర్చు పెడుతున్న శంకర్ ?
శంకర్ సినిమాల్లో పాటలకు ప్రత్యేక స్థానం ఉంటుందన్న సంగతి తెలిసిందే. పాటలను అందంగా చిత్రీకరించడం కోసం ఎంతగానో ఖర్చు చేస్తుంటారు. అందుకే శంకర్ సినిమాల పాటలు ప్రత్యేకంగా ఉంటాయి. అప్పుడెప్పుడో తీసిన జీన్స్ సినిమా నుండి ఇప్పటి వరకు శంకర్ స్టైల్ అలాగే ఉంది. అదే స్టైల్ లో రామ్ చరణ్ 15వ సినిమా కోసం ఓ పాటను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా సినిమా రూపొందుతున్న మాట అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఒక పాటకు భారీ స్థాయిలో ఖర్చు చేయబోతున్నారట. ఏకంగా పదికోట్లకు పైగా ఒకే ఒక్క పాట కోసం బడ్జెట్ కేటాయిస్తున్నారట. హైదరాబాద్ లోని స్టూడియోలో వేసిన సెట్లో ఈ పాటను రూపొందిస్తున్నారని అంటున్నారు.
పదికోట్ల బడ్జెట్, పది రోజుల షూటింగ్
ప్రస్తుతం ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల ఆధ్వర్యంలో సెట్ పనులు జరుగుతున్నాయట. ఈ నెల 19వ తేదీ నుండి పాట షూటింగ్ మొదలై పదిరోజుల పాటు సాగుతుందని చెప్పుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికాలో ఉన్నాడు. ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ముగిసిన తర్వాత ఈ నెల 15వ తేదీన ఇండియాకు తిరిగి వస్తున్నాడట. ఆ తర్వాత మరో 4రోజుల్లోనే షూటింగ్ లో పాల్గొంటాడని చెబుతున్నారు. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ సినిమాకు సీఈవో లేదా సేనాని అనే టైటిల్ ను ఖరారు చేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. దిల్ రాజు నిర్మాతగా రూపొందుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.