Meenakshi: మీనాక్షి చౌదరికి ఊరట.. అశ్లీల కంటెంట్‌పై కోర్టు కీలక ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ కథానాయిక మీనాక్షి చౌదరికి సంబంధించిన అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్‌ను తొలగించాలని ఆదేశిస్తూ దిల్లీ హైకోర్టు ఏకపక్ష తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మీనాక్షి తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం, తన చిత్రాలను ఏ విధంగానూ ఉపయోగించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. మీనాక్షికి సంబంధించిన అశ్లీల కంటెంట్‌ను తొలగించాలని ఆదేశించింది. అయితే ఏకపక్ష దశలో ఆమె ఫొటోలకు సంబంధించి పూర్తిస్థాయి నిషేధాజ్ఞ ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది.
వివరాలు
ఆధారాలను సమర్పించాలి
మీనాక్షి చౌదరి పేరును వాణిజ్య ప్రయోజనాల కోసం, డబ్బు సంపాదించేందుకు ఎలా ఉపయోగిస్తున్నారో నిరూపించే ఆధారాలను సమర్పించాలని ఆమె తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది.
''వ్యక్తిత్వ హక్కులకు సంబంధించిన వ్యవహారాల్లో 'బ్లాంకెట్ ఇంజంక్షన్' (అన్నింటికీ వర్తించేలా పూర్తిస్థాయి నిషేధాజ్ఞలు) జారీ చేయలేం.
ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నాం. ఎవరైనా మీ చిత్రాలు, ఇతర అంశాలను ఉపయోగించి డబ్బు సంపాదిస్తున్నారనే విషయాన్ని కచ్చితంగా నిరూపించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.