వృద్ధాశ్రమంలో ప్రముఖ దర్శకుడు కేజీ జార్జ్ కన్నుమూత
ప్రఖ్యాత మలయాళం దర్శకుడు కేజీ జార్జ్, 77ఏళ్ళ వయసులో వృద్ధాశ్రమంలో కన్నుమూసారు. కొన్ని రోజులుగా వృద్ధ్యాప్యానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కేజీ జార్జ్, ఎర్నాకులం లోని కక్కనాడ్ ప్రాంతంలో గల వృద్ధాశ్రమంలో కన్నుమూసారు. కేజీ జార్జ్ పూర్తి పేరు కులక్కత్తిల్ గీవర్గీస్ జార్జ్. కేరళలోని తిరువల్లాలో జన్మించిన జార్జ్, కెరీర్ మొదట్లో రాము కరియత్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసారు. ఆ తర్వాత 1975లో స్వప్నదానం అనే సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. 1980ప్రాంతంలో దర్శకుడిగా కేజీ జార్జ్ ఒక వెలుగు వెలిగారు.
మధ్యస్థ సినిమాలను తెరకెక్కించిన జార్జ్
కేజీ జార్జ్ సినిమాలు అటు కమర్షియల్ సినిమాల మాదిరి కాకుండా, ఇటు ఆర్ట్ సినిమాల మాదిరి మధ్యస్థంగా సినిమాలను తెరకెక్కించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లో ఇరక్కల్, యవనిక, అదమింటే వరియేళ్ళు చిత్రాలు ప్రముఖమైనవి. ఇవే కాదు, కొలంగల్(1981), లేఖయుడే మరణం ఒరు ఫ్లాష్ బ్యాక్( 1983), మట్టోరల్(1988) చిత్రాలు మంచి ప్రజాదరణ పొందాయి. 1990 తర్వాత కేజీ జార్జ్ సినిమాలు తగ్గించారు. ఆయన చివరిగా దర్శకత్వం వహించిన ఎలవంకొడు దేశం సినిమా 1998లో విడుదలైంది. కేజీ జార్జ్ మృతిపట్ల మలయాళం సినిమా ఇండస్ట్రీ సెలెబ్రిటీలు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.