Page Loader
Rishab Shetty: శ్రీకృష్ణదేవరాయల పాత్రలో రిషబ్ శెట్టి.. హిస్టారికల్‌గా బిగ్ ప్రాజెక్ట్ రెడీ!
శ్రీకృష్ణదేవరాయల పాత్రలో రిషబ్ శెట్టి.. హిస్టారికల్‌గా బిగ్ ప్రాజెక్ట్ రెడీ!

Rishab Shetty: శ్రీకృష్ణదేవరాయల పాత్రలో రిషబ్ శెట్టి.. హిస్టారికల్‌గా బిగ్ ప్రాజెక్ట్ రెడీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 14, 2025
12:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇతిహాస పుటల్లో ఎంతోమంది రాజులొచ్చారు. వెళ్లిపోయారు. కానీ విజయనగర సామ్రాజ్యంలో తనదైన ముద్ర వేసిన మహాన్ శాసకుడు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. తన సుప్రిపాలన, ధర్మపరాయణత, సాహిత్యాభిమానంతో ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచారు. తుళువ వంశానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు 1471లో జన్మించి, 1509లో గద్దె అధిష్ఠానమై, 1529 వరకు సుదీర్ఘంగా దాదాపు 20 ఏళ్లపాటు విజయవంతంగా పాలించారు. ఆయన రాజ్యమేలిన కాలం తెలుగు సాహిత్యంలో 'స్వర్ణయుగం'గా గుర్తింపు పొందింది. రాయల ఆస్థానంలో 'అష్టదిగ్గజాలు' అనే ఎనిమిది మంది మహాకవులు ఉన్నారు. అందులో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, తెనాలి రామకృష్ణ వంటి ప్రసిద్ధ కవులు తమ రచనలతో రాజసభను ప్రఖ్యాతిని తెచ్చిపెట్టారు.

Details

కాంతర 2ను డైరక్ట్ చేస్తున్న రిషబ్

శ్రీకృష్ణదేవరాయల పాత్రను ఇప్పటికే పలు చిత్రాల్లో పలువురు ప్రముఖ నటులు పోషించారు. ముఖ్యంగా 1956లో విడుదలైన 'తెనాలి రామకృష్ణ' , 1962లో వచ్చిన 'మహామంత్రి తిమ్మరుసు' చిత్రాల్లో నందమూరి తారకరామారావు ఈ పాత్రలో ఒదిగిపోయారు. ఆతర్వాత ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ 'ఆదిత్య 369'లో రాయలుగా కనిపించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. హీరో శ్రీకాంత్ కూడా 'దేవరాయ' సినిమాలో రాయల పాత్ర పోషించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 'కాంతార' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రిషబ్ శెట్టి మరో హిస్టారికల్ ప్రాజెక్ట్‌కి సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన 'కాంతార 2' అనే ప్రీక్వెల్‌ను డైరెక్ట్ చేస్తూ హీరోగా కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Details

శివాజీ పాత్రలో రిషబ్ శెట్టి

మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ బయోపిక్‌లోనూ రిషబ్ నటించబోతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో శ్రీకృష్ణదేవరాయల జీవితాన్ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించనున్న భారీ బయోపిక్‌లో రిషబ్ శెట్టి టైటిల్ రోల్ పోషించనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను 'జోధా అక్బర్', 'పానిపట్', 'లగాన్' వంటి క్లాసిక్ చిత్రాలకు దర్శకుడిగా గుర్తింపు పొందిన అశుతోష్ గోవారికర్ తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ క్రేజీ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది గానీ, ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహిస్తున్న 'కాంతార 2' ఈ ఏడాది అక్టోబర్ 2న విడుదల కానుంది.