Rishab Shetty: ఛత్రపతి శివాజీ మహారాజ్‌గా రిషబ్ శెట్టి.. 2027లో గ్రాండ్ రిలీజ్
వైవిధ్యమైన పాత్రలు పోషించడంలో రిషబ్ శెట్టి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. నటనలోనే కాదు, దర్శకత్వంలోనూ ఆయన ప్రతిభ ప్రపంచానికి తెలిసిందే. తాజాగా రిషబ్ భారత దేశానికే గొప్ప గౌరవం తీసుకొచ్చిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఓ చిత్రంలో నటించనున్నారు. ఈ ప్రాజెక్టుపై రిషబ్ శెట్టి స్పందించారు. ఇది కేవలం ఒక సినిమా కాదని, అసమానతలపై పోరాడిన శక్తివంతమైన వ్యక్తి కథ అని చెప్పారు. ఇలాంటి గొప్ప యోధుడి జీవితాన్ని తెరపై ఆవిష్కరించడంలో భాగం కావడం తన జీవితంలో గర్వకారణమన్నారు. ఈ సినిమా శివాజీ మహారాజ్ గురించి తెలియని ఎన్నో విషయాలను తెలియజేస్తుందన్నారు.
దర్శకుడిగా సందీప్ సింగ్
ఈ ప్రాజెక్ట్‌ను సందీప్ సింగ్ డైరెక్ట్ చేస్తుండగా, 2027 జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేయగా, అది ఇప్పటికే వైరల్ అవుతోంది. రిషబ్ శెట్టి గతంలో 'కాంతార' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో అందరి మన్ననలు పొందారు. శివాజీ మహారాజ్ పాత్రతో రిషబ్ మరో అద్భుతాన్ని సృష్టించబోతున్నారని నెటిజన్లు భావిస్తున్నారు. రిషబ్ శెట్టి మరొక ఆసక్తికర పాత్రలో 'జై హనుమాన్' సినిమాలో కనిపించనున్నారు. 'హనుమాన్' సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రకటించారు.