
Bigg Boss Lobo: రోడ్డు యాక్సిడెంట్ కేసులో బిగ్‌బాస్ ఫేమ్ లోబోకు ఏడాది జైలు
ఈ వార్తాకథనం ఏంటి
రోడ్డు ప్రమాదం కేసులో టీవీ నటుడు లోబో, అలియాస్ ఖయూమ్ కు పెద్ద షాక్ తగిలింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. కేసు విచారణలో, ఈ ప్రమాదానికి కారణమైన లోబోకు జనగామ కోర్టు ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ, రూ. 12,500 జరిమానా కూడా విధించింది. సమాచారం ప్రకారం, 2018 మే 21న టీవీ ఛానల్ ఒక కార్యక్రమం కోసం లోబో టీమ్ రామప్ప, లక్నవరం, భద్రకాళి చెరువు, వేయిస్తంభాల ఆలయం తదితర ప్రాంతాల్లో పర్యటించింది. ఈ పర్యటన సందర్భంగా లోబో స్వయంగా కారు నడుపుతూ వరంగల్ నుండి హైదరాబాద్ వైపుకు వెళ్తుండగా, రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొట్టాడు.
వివరాలు
లోబోకు ఏడాది జైలు శిక్ష,జరిమానా
ఈ దుర్ఘటనలో ఆటోలో ఉన్న ఖిలాషాపురం గ్రామానికి చెందిన మేడె కుమార్ ,పెంబర్తి మణెమ్మ తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా, మరికొందరు వ్యక్తులకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. మృతుల కుటుంబాల ఫిర్యాదు మేరకు రఘునాథపల్లి పోలీసులు కేసును నమోదు చేసి, పూర్తి సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. కోర్టు విచారణలో ఇరుపక్షాల వాదనలు వినాక, న్యాయమూర్తి లోబోకు ఏడాది జైలు శిక్ష విధించి, రూ. 12,500 జరిమానా విధిస్తూ తీర్పును ప్రకటించారు.