LOADING...
Champion Trailer: రోషన్‌ మేకా 'ఛాంపియన్' ట్రైలర్ రిలీజ్‌.. స్పోర్ట్స్‌ డ్రామాపై భారీ హైప్

Champion Trailer: రోషన్‌ మేకా 'ఛాంపియన్' ట్రైలర్ రిలీజ్‌.. స్పోర్ట్స్‌ డ్రామాపై భారీ హైప్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 19, 2025
09:17 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రోషన్‌ మేకా, అనస్వర రాజన్‌ జంటగా నటించిన తాజా స్పోర్ట్స్‌ డ్రామా 'ఛాంపియన్' నుంచి మరో సర్‌ప్రైజ్‌ వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, క్యారెక్టర్‌ లుక్స్‌, పాటలకు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ చేతుల మీదుగా 'ఛాంపియన్' ట్రైలర్‌ను లాంచ్‌ చేయడం సినిమాకు మరింత హైప్‌ను తీసుకొచ్చింది. ట్రైలర్‌ను గమనిస్తే, బ్రిటీష్‌ కాలం తర్వాత నిజాం పాలన కొనసాగుతున్న హైదరాబాద్‌ నేపథ్యాన్ని బలంగా ఆవిష్కరించారు. ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ మైఖేల్‌ సి విలియమ్స్‌ పాత్రలో రోషన్‌ మేకా కనిపించబోతున్నారు.

Details

ఆసక్తిని రేపుతున్న ట్రైలర్

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా... హైదరాబాద్‌లో మాత్రం నిజాం పాలన కింద నలిగిపోతూ నవాబులకు సలాం కొట్టాల్సిందే" అనే శక్తివంతమైన డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమవడం వెంటనే ఆసక్తిని రేకెత్తిస్తోంది. బైరాన్‌పల్లి గ్రామంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు నేపథ్యంగా కథ సాగనుందని ట్రైలర్‌ స్పష్టత ఇస్తోంది. అదే సమయంలో ఆ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌ కావాలనే కలతో ముందుకు సాగడం కథలో కీలకంగా చూపించారు. తమ ఊరిపై జరిగిన దాడులను గ్రామస్థులు ఎలా ఎదుర్కొన్నారు? ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌ కావాలని ఆశించే ఆ యువకుడు నిజాం దాడులను ఎలా తట్టుకున్నాడు? నిజాం పాలనకు, స్పోర్ట్స్‌కు మధ్య ఉన్న లింక్‌ ఏమిటి? వంటి ప్రశ్నలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.

Details

ఈనెల 25న రిలీజ్

ఇప్పటికే టీజర్‌లో 'లగాన్' తరహా వైబ్స్‌ ఇచ్చిన ఈ సినిమా, ట్రైలర్‌తో ఆ హైప్‌ను పదింతలు పెంచింది. ఈ చిత్రంలో రోషన్‌ మేకా సరసన అనస్వర రాజన్‌ హీరోయిన్‌గా నటించగా, ఒకప్పటి స్టార్‌ హీరో నందమూరి కల్యాణ్‌ కీలక పాత్రలో రాజి రెడ్డిగా కనిపించనున్నారు. అర్చన మరో ముఖ్య పాత్రలో నటించారు. ఇటీవల విడుదలైన క్యారెక్టర్‌ లుక్స్‌కు మంచి స్పందన లభించగా, లవ్‌ సాంగ్‌ 'గిరగిరగిర గింగిరా గిరే' యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రదీప్‌ అద్వైతం దర్శకత్వం వహించారు. స్వప్న దత్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'ఛాంపియన్' ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement