ఆర్ఆర్ఆర్: గోల్డెన్ గ్లోబ్ లో నాటు నాటు పాటకు అవార్డ్, ఆ క్యాటగిరీలో మిస్
రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ మూవీ, ప్రపంచ సినిమా పురస్కారాల్లో తన సత్తా చాటుతోంది. ఆల్రెడీ పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రం, ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది. ఉత్తమ పాట విభాగంలో ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కింది. ఆర్ఆర్ఆర్ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి అవార్డు అందుకున్నారు. ఇది తెలుగు సినిమాకి మొట్టమొదటి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్. అంతేకాదు ఉత్తమ పాట విభాగంలో భారతదేశానికే మొట్ట మొదటి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్. అవార్డ్ అందుకున్న సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ, సినిమా దర్శకుడు రాజమౌళికి, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, పాట రచయిత చంద్రబోస్, పాడినవారు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ లకు థ్యాంక్స్ చెప్పారు.
బెస్ట్ పిక్చర్ విభాగంలో మిస్ అయిన అవార్డ్
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో రెండు నామినేషన్లు దక్కించుకున్న ఆర్ఆర్ఆర్, ఉత్తమ ఫారెన్ లాంగ్వేజ్ చిత్రం విభాగంలో అవార్డ్ అందుకోలేకపోయింది. ఆ విషయంలో ఆర్ఆర్ఆర్ అభిమానులు కొంత నిరాశ పడుతున్నారు. నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ రావడంతో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖుల నుండి ప్రశంసల జల్లు కురుస్తోంది. తెలుగు సినిమాకు గర్వకారణం అంటూ సినిమా ఇండస్ట్రీ నుండి ట్వీట్లు వస్తున్నాయి. బాలీవుడ్ తారలు ఆర్ఆర్ఆర్ సాధించిన ఘనతను ప్రశంసిస్తున్నారు. ఇక తర్వాతి అడుగు ఆస్కార్స్ అని అందరూ హ్యాష్ ట్యాగ్ లు పెడుతున్నారు. మొత్తానికి తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ వేదిక మీద రెపరెపలాడుతోంది. భారతీయ సినిమా గురించి ప్రపంచం చర్చించుకుంటోంది. ఇదే ఊపులో ఆస్కార్స్ కూడా అందుకుంటుందని అందరూ అనుకుంటున్నారు.