Sai Pallavi: స్క్రిప్ట్ నచ్చి వెంటనే ఓకే చెప్పా: సాయి పల్లవి
ఈ వార్తాకథనం ఏంటి
అమీర్ ఖాన్ కుమారుడు జునైద్‌తో కలిసి సాయి పల్లవి నటించిన తాజా బాలీవుడ్ చిత్రం 'ఏక్ దిన్'. ఈ సినిమాతో ఆమె హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినా, ఆశించిన స్థాయిలో స్పందన మాత్రం రాలేదు. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిశ్రమ స్పందనకే పరిమితమైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి, ఈ సినిమాను ఎందుకు అంగీకరించిందనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
అందుకే ఆ ప్రాజెక్ట్ చేశానన్న సాయి పల్లవి..
ఆమె మాట్లాడుతూ.. '''ఏక్ దిన్' సినిమా చేయడానికి ప్రధాన కారణం దాని కథ. ఆ సమయంలో నేను వరుసగా భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటిస్తున్నాను. అందుకే కాస్త హాయిగా, మనసుకు తేలికగా అనిపించే పాత్రలో నటించాలని అనిపించింది. షూటింగ్ సమయంలో కానీ, సినిమా పూర్తయ్యాక కానీ మానసిక ఒత్తిడి లేకుండా ఉండే కథ కావాలనుకున్నాను. ఈ స్క్రిప్ట్ వినగానే నాకు హాలీవుడ్ క్లాసిక్ మూవీ 'బిఫోర్ సన్‌రైజ్' గుర్తుకొచ్చింది. ఆ సినిమా నాకు ఎంతో ఇష్టం. అందుకే వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు అంగీకరించాను'' అని తెలిపారు.
వివరాలు
వన్ డే ఆధారంగా సాగే కథ..
అలాగే ఆమె మాట్లాడుతూ.. ''సినిమా ప్రీమియర్ చూసిన తర్వాత మాత్రం ఈ పాత్రకు నేను పూర్తిగా సరిపోలేదేమో అనిపించింది. ఇదే విషయాన్ని ఆమిర్ ఖాన్‌కి కూడా చెప్పాను. 'నా బదులు ఇంకెవరినైనా ఎంపిక చేసి ఉంటే బాగుండేదేమో. ఉత్సాహంగా, చురుకుగా కనిపించే కొత్త అమ్మాయి అయితే ఈ పాత్రకు మరింత న్యాయం చేసేదేమో' అని నా అభిప్రాయాన్ని ఆయనతో పంచుకున్నాను'' అని చెప్పారు. ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న జునైద్ మాత్రం, ఈ పాత్రకు సాయి పల్లవే సరైన ఎంపిక అని అభిప్రాయపడ్డారు. కాగా, 'ఏక్ దిన్' చిత్రం థాయ్ సినిమా 'వన్ డే' ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమాను అమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించింది.