Saif Ali Khan: మెరుగుపడ్డ సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం.. ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇవాళ లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు. ఉదయం 10 గంటలకు సైఫ్ డిశ్చార్జ్ కావొచ్చని సమాచారం.
ఇప్పటికే డిశ్చార్జ్‌కు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయినట్లు తెలుస్తోంది. గతంలో ఈనెల 16న సైఫ్ ఇంట్లో చోరీకి యత్నించిన దుండగుడు అతనిపై దాడి చేసిన సంగతి తెలిసిందే.
కత్తిపోట్లకు గురైన సైఫ్ ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు.
వెన్నెముకకు తీవ్ర గాయం కావడంతో వైద్యులు అత్యవసరంగా సర్జరీ చేసి, కత్తిని తొలగించారు. ఇక ఈ కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Details
ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు
నిందితుడిని బంగ్లాదేశ్‌లోని ఝలోకటి జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. అతడు ఐదు నెలలుగా ముంబయిలో ఉంటూ హౌస్ కీపింగ్ వంటి చిన్నచిన్న పనులు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు విచారణలో భాగంగా నిందితుడి వేలిముద్రలను పలు ప్రాంతాల్లో సేకరించారు.
దాడి జరిగిన ప్రదేశంలో, ఇంటి కిటికీలపై, అలాగే ఇంట్లోకి ప్రవేశించడానికి ఉపయోగించిన నిచ్చెనపై నిందితుడి వేలిముద్రలు లభించినట్లు ఫోరెన్సిక్ బృందం నిర్ధారించింది.
ఈ సందర్భంగా క్రైమ్ బ్రాంచ్ అధికారులు సైఫ్ భవనాన్ని సందర్శించి ఆధారాలు సేకరించినట్లు తెలిపారు.
సైఫ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తుండగా, నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.