imdb most popular actors: అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ నటులుగా అహాన్,అనీత్
ఈ వార్తాకథనం ఏంటి
మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా చిత్రం 'సయారా' (Saiyaara) ద్వారా నటీనటులు అహాన్ పాండే (Ahaan Panday), అనీత్ పడ్డా (Aneet Padda) ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. తాజాగా వీరి ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది. సినిమాలు, టెలివిజన్ షోలు, సెలబ్రిటీల వివరాలను విశ్లేషించి ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయ సమాచారాన్ని అందించే వేదిక IMDB - 2025 సంవత్సరానికి గాను అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ నటులు, దర్శకుల జాబితాను (IMDB Most Popular Indian Celebrities 2025) తాజాగా విడుదల చేసింది.
వివరాలు
'సయారా' సినిమా బాక్సాఫీసు వద్ద రూ.570 కోట్లకు పైగా వసూళ్లు
ఈ జాబితాలో 'సయారా'లో నటించిన అహాన్ పాండే, అనీత్ పడ్డా ఇద్దరూ కీలకంగా నిలిచారు. ఒక్క సినిమాతోనే భారీ గుర్తింపు సాధించడం విశేషం. అదే చిత్రాన్ని తెరకెక్కించిన మోహిత్ సూరి ఈ ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన దర్శకుడిగా అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. కేవలం రూ.45 కోట్లతో రూపొందిన 'సయారా' సినిమా బాక్సాఫీసు వద్ద రూ.570 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దర్శకుల జాబితాలో మోహిత్ సూరి తర్వాతి స్థానాల్లో ఆర్యన్ ఖాన్ (ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్),లోకేశ్ కనగరాజ్ (కూలీ) నిలిచారు. కాగా,ఈ ర్యాంకింగ్స్‌ను IMDB ప్రేక్షకుల అభిరుచులు,ఆన్‌లైన్ సెర్చ్ ట్రెండ్స్, వ్యూస్ తదితర విశ్లేషణ ఆధారంగా రూపొందించింది.
వివరాలు
2025 సంవత్సరానికి గానూ భారతీయ సినీ దర్శకుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న మోహిత్ సూరి
ఈ క్రమంలో, 2025 సంవత్సరానికి గానూ భారతీయ సినీ దర్శకుల్లో అగ్రస్థానాన్ని మోహిత్ సూరే కైవసం చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా IMDB ఇండియా హెడ్ యామిని పటోడియా మాట్లాడుతూ - "అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారలతో పాటు, దర్శకుల జాబితాను కూడా తొలిసారి IMDB ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఇప్పుడు నటుల సరసనే దర్శకులకు కూడా ప్రత్యేకమైన అభిమాన గణం ఏర్పడుతోంది. కథను చెప్పే విధానం, దాన్ని తెరపై చూపించే శైలి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది" అని పేర్కొన్నారు.
వివరాలు
మీ ఆదరణే ఈ విజయాన్ని నాకు అందించింది
తన విజయంపై స్పందించిన అహాన్ పాండే మాట్లాడుతూ.. "ఇది నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చే విషయం. తొలి చిత్రంతోనే 2025 IMDB అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారల జాబితాలో నంబర్ వన్ స్థానంలో నిలవడం నిజంగా ఒక కల నెరవేరినట్లే. ఈ గౌరవం నా వృత్తిపై మరింత బాధ్యతను పెంచింది. నా దర్శకుడు మోహిత్ సూరికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆయన మార్గదర్శకత్వం, ప్రతిభకు ఇది అద్దం పడుతోంది" అని అన్నారు. "'వాణి' పాత్రలోని ప్రత్యేకతను గమనించి నన్ను ప్రేమించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ఆదరణే ఈ విజయాన్ని నాకు అందించింది" అని తెలిపారు.
వివరాలు
ఐఎండీబీ 2025 అత్యంత ప్రజాదరణ పొందిన నటీనటులు
అహాన్ పాండే (సయారా) అనీత్ పడ్డా (సయారా) ఆమిర్ ఖాన్ (సితారే జమీన్ పర్) ఇషాన్ ఖట్టర్ (హోం బౌండ్) లక్ష్య (ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్) రష్మిక మందన్న (ఛావా, సికిందర్, థామా, కుబేర) కల్యాణి ప్రియదర్శన్ (లోక:చాప్టర్1) త్రిప్తి డిమ్రి (ధడక్2) రుక్మిణి వసంత్ (కాంతార: చాప్టర్1) రిషబ్ శెట్టి (కాంతార: చాప్టర్1)
వివరాలు
అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ దర్శకులు
మోహిత్ సూరి (సయారా) ఆర్యన్ ఖాన్ (ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్) లోకేశ్ కనగరాజ్ (కూలీ) అనురాగ్ కశ్యప్ (నిశాంచి, బందర్) పృథ్వీరాజ్ సుకుమారన్ (ఎల్2: ఎంపురాన్) ఆర్.ఎస్. ప్రసన్న (సితారే జమీన్ పర్) అనురాగ్ బసు (మోట్రో ఇన్ దినో) డోమినిక్ అరుణ్ (లోక:చాప్టర్1) లక్ష్మణ్ ఉటేకర్ (ఛావా) నీరజ్ ఘేవాన్ (హోం బౌండ్)