Maa Inti Bangaram: ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన 'మా ఇంటి బంగారం'.. స్ట్రీమింగ్ వివరాలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
ఓటిటి ప్రేక్షకులకు శుభవార్త. సమంత ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ కామెడీ డ్రామా 'మా ఇంటి బంగారం' త్వరలో డిజిటల్ ప్రేక్షకులను అలరించనుంది. నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో ఘన విజయాన్ని నమోదు చేసిన తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. జులై 17 నుంచి ఈ సినిమా జియోహాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఓటీటీ సంస్థ "ఒక్కొక్కడిని కొడతాం చూడు... ప్రేమతో అబ్బా!" అనే క్యాప్షన్‌తో అధికారికంగా వెల్లడించింది. జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విశేష ఆదరణ పొందింది. ముఖ్యంగా రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన తొలి మహిళా ప్రధాన కథా చిత్రంగా గుర్తింపు పొందింది.
వివరాలు
సమంతకు మరో బలమైన కమ్‌బ్యాక్
దీంతో సమంత కెరీర్‌లో మరో కీలక విజయంగా ఈ సినిమా నిలిచింది. కొన్ని వరుస పరాజయాలు,సుదీర్ఘ విరామం తర్వాత సమంత నటించిన చిత్రంగా 'మా ఇంటి బంగారం'పై ప్రారంభంలో పెద్దగా అంచనాలు లేవు. అయితే విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి క్రమంగా మంచి స్పందన లభించింది. యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకట్టుకుంది.సమంత తన నటనతో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ ఆకట్టుకోగా, దర్శకురాలు నందినిరెడ్డి కథను వినోదాత్మకంగా, భావోద్వేగాలతో మేళవించి తెరకెక్కించారు. రొటీన్ కథాంశం ఉన్నప్పటికీ, ఆసక్తికరమైన కథనం, కుటుంబ అనుబంధాలను హృద్యంగా చూపించడం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. కుటుంబ కథలను కొత్త కోణంలో ఆవిష్కరిస్తే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే విషయాన్ని ఈ చిత్రం మరోసారి నిరూపించింది.
వివరాలు
కథ ఏంటంటే...
చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన స్వర్ణ (సమంత) అనాథాశ్రమంలో పెరుగుతుంది. తర్వాత పెద్దింటికి చెందిన అనిరుధ్ (దిగంత్ మంచాలే)ను ప్రేమించి వివాహం చేసుకుంటుంది. కుటుంబ సభ్యులకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడనే కారణంతో అనిరుధ్‌ను అతని కుటుంబం దూరం చేస్తుంది. తన వల్లే భర్త కుటుంబానికి దూరమయ్యాడనే బాధతో స్వర్ణ, అతడిని మళ్లీ కుటుంబంతో కలపాలని నిర్ణయించుకుంటుంది.
వివరాలు
కథ ఏంటంటే...
ఇదే సమయంలో ఆ ఇంట్లో ఒక శుభకార్యం జరగడంతో తొలిసారి అత్తారింట్లో అడుగుపెడుతుంది. అక్కడి సంప్రదాయాలు, ఆచారాలు, కుటుంబ నియమాల గురించి ఏమీ తెలియకపోయినా, వాటిని నేర్చుకుని అందరి మనసులు గెలుచుకోవాలని ప్రయత్నిస్తుంది. అయితే ఆమె గతం మళ్లీ వెంటాడుతుంది. ఆ పరిస్థితుల మధ్య కుటుంబ సభ్యుల ప్రేమను ఎలా సంపాదించింది? భర్తను కుటుంబంతో తిరిగి ఎలా కలిపింది? తన గతం వల్ల ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించింది? అన్న ప్రశ్నలకు సమాధానమే 'మా ఇంటి బంగారం' కథ.