Samyuktha Menon: 'స్వయంభూ'లో వీరనారిగా సంయుక్త.. పుట్టినరోజు స్పెషల్ వీడియో అదిరిందిగా!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం 'స్వయంభూ'. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్లామర్ డాల్స్ సంయుక్త మీనన్, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. నేడు సంయుక్త మీనన్ పుట్టినరోజు సందర్భంగా 'స్వయంభూ' చిత్ర బృందం ఆమెకు ప్రత్యేకంగా విషెస్ చెబుతూ ఓ వీడియోను విడుదల చేసింది. ఈ 40 సెకన్ల వీడియోలో సంయుక్త చేతిలో కత్తి పట్టుకుని శత్రువులతో పోరాడుతూ శౌర్యవంతమైన వీరనారి పాత్రలో కనిపించారు. ఆమె యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
వివరాలు
యోధురాలిగా సరికొత్త అవతార్ లో సంయుక్త
'స్వయంభూ'లో సంయుక్త 'భూమి' అనే శక్తిమంతమైన పాత్రను పోషిస్తున్నారు.
తన పాత్రను సినిమాలో అత్యంత సహజంగా, పవర్‌ఫుల్‌గా పండించేందుకు ఆమె ప్రత్యేకంగా గుర్రపు స్వారీతో పాటు యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకున్నారు.
ఇప్పటివరకు వెండితెరపై సున్నితమైన భావోద్వేగాలను పలికించిన సంయుక్త.. 'స్వయంభూ'లో మాత్రం ఓ యోధురాలిగా సరికొత్త అవతార్‌లో కనిపించనున్నారు.
సంయుక్త కెరీర్‌లోనే 'భూమి' పాత్ర అత్యంత సవాలుతో కూడుకున్న పాత్రగా నిలవనుందని చిత్ర బృందం చెబుతోంది.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. 'స్వయంభూ' అధికారిక విడుదల తేదీని త్వరలోనే చిత్ర యూనిట్ ప్రకటించనుంది.