Mana Shankara Vara Prasad Garu : సంక్రాంతి స్పెషల్ రివ్యూ.. 'మన శంకరవరప్రసాద్‌గారు'లో చిరు మ్యాజిక్ ఎంతవరకు వర్కౌట్ అయింది?
ఈ వార్తాకథనం ఏంటి
అగ్ర కథానాయకుడు చిరంజీవి సినిమా అంటే అభిమానులకు అది ఒక పండగ. అలాంటి చిరంజీవి, వరుస విజయాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందిస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా అనగానే టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా అనిల్ రావిపూడి సినిమాలు సంక్రాంతి బరిలో దిగితే విజయం సాధించడం ఆయనకు అలవాటే. ఈ నేపథ్యంలో 'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమాతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి ఈ సినిమాలో చిరంజీవిని అనిల్ రావిపూడి ఎలా చూపించారు? అతిథి పాత్రలో వెంకటేశ్ చేసిన సందడి ఎంతవరకు వర్కౌట్ అయింది అన్నదే ప్రశ్న.
Details
కథేంటంటే..
శంకరవరప్రసాద్ (చిరంజీవి) నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. కేంద్ర మంత్రి శర్మ (శరత్ సక్సేనా)కు రక్షణ బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. మంత్రి శంకరవరప్రసాద్‌ను తన కుటుంబ సభ్యుడిలా భావిస్తాడు. అతని భార్య శశిరేఖ (నయనతార) నుంచి వరప్రసాద్ విడిపోయిన విషయం తెలుసుకున్న మంత్రి, బోర్డింగ్ స్కూల్‌లో చదువుతున్న అతని పిల్లలతో కలిసి గడిపేలా ఏర్పాట్లు చేస్తాడు. పీఈటీగా ఆ స్కూల్‌లోకి అడుగుపెట్టిన శంకరవరప్రసాద్ తన పిల్లలకు చేరువయ్యాడా? భార్యతో ఎందుకు విడిపోయాడు? వారి పెళ్లి ఎలా జరిగింది? చిన్న వయసులోనే తండ్రికి దూరమైన పిల్లలకు శంకరవరప్రసాదే తమ తండ్రి అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది? కర్ణాటకకు చెందిన మైనింగ్ బిజినెస్‌మ్యాన్ వెంకీ గౌడ (వెంకటేశ్)కు, శశిరేఖకు మధ్య ఉన్న బంధం ఏమిటి?
Details
ఎలా ఉందంటే..
విడిపోయిన భార్యాభర్తలు మళ్లీ కలుస్తారా లేదా? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే సినిమాను తెరపై చూడాల్సిందే. 'పండగకు వస్తున్నారు', 'అదిరిపోద్ది సంక్రాంతి' అంటూ ప్రచారం చేసిన ఈ సినిమా అదే తరహాలో ఆహ్లాదాన్ని పంచేలా రూపొందింది. బలమైన కథను చెప్పాలన్న ఆలోచన కంటే థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుడిని నవ్వించాలన్నదే దర్శకుడి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. గతేడాది సంక్రాంతికి వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' తరహాలోనే లాజిక్స్, బలమైన భావోద్వేగాలు, లోతైన సందేశాలను పూర్తిగా పక్కన పెట్టి,తన మార్క్ వినోదంతో పైసా వసూల్ సినిమా అందించారు అనిల్ రావిపూడి. కుటుంబ ప్రేక్షకులకు ఇది పక్కా పండగ సినిమా. చిరంజీవిలోని పాత టైమింగ్, నటనలోని హుషారు, వింటేజ్ లుక్స్‌ను మరోసారి తెరపై చూడటం అభిమానులకు బోనస్‌లా మారింది.
Details
చిరంజీవి టైమింగ్ బాగుంది
మరో అగ్ర కథానాయకుడు వెంకటేశ్ అతిథి పాత్రలో చేసిన సందడి వాణిజ్యపరంగా సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చింది. కుటుంబ కథలు, కామెడీ కథల్లో చిరంజీవి టైమింగ్ ఎలాంటిదో మరోసారి రుజువైంది. మాస్ ఎలివేషన్లకు భిన్నంగా చిరు పక్కా ఫ్యామిలీ మ్యాన్ అవతారంలో కనిపిస్తారు. కేంద్రమంత్రి ఇంటి నుంచే కథ ప్రారంభమవుతుంది. జ్వాల (కేథరిన్), నారాయణ (హర్షవర్ధన్), ముస్తాఫా (అభినవ్ గోమఠం)లతో కలిసి ఆరంభం నుంచే కామెడీ మొదలుపెడతారు. తొలి ఫైట్‌లో చిరంజీవికి తగిన ఎలివేషన్ ఉంటుంది. అనంతరం హుక్ స్టెప్ పాట సినిమాకు మరింత జోష్‌ను అందిస్తుంది. సెక్యూరిటీ, మంత్రికి ప్రాణహాని వంటి అంశాలు సీరియస్‌గా అనిపించినా, తొలి ఫైట్ తర్వాత కథ పూర్తిగా భార్యాభర్తల నేపథ్యానికి మారిపోతుంది.
Details
ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు సూపర్బ్
బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక పాట సాగుతుండగా, శంకరవరప్రసాద్, శశిరేఖ మధ్య సన్నిహిత క్షణాలు, మూడు రాష్ట్రాలు తిరిగి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యే సన్నివేశాలను సరదాగా చూపించిన విధానం నవ్విస్తుంది. భార్యాభర్తలు విడిపోయే సన్నివేశాల్ని కూడా హాస్యంగా తెరకెక్కించారు. కథ స్కూల్‌కు మారిన తర్వాత ఎస్పీఎల్ పాత్రలో బుల్లిరాజు చేసే హడావుడి, అడవిలో కుక్కపిల్ల కోసం వేట, అనుకోకుండా శశిరేఖ స్కూల్‌కు రావడం వంటి సన్నివేశాలతో ప్రథమార్ధం సరదాగా సాగుతుంది. పిల్లల నేపథ్యంలో కొన్ని సన్నివేశాల్లో మాత్రమే నాటకీయత ఎక్కువగా అనిపిస్తుంది. ద్వితీయార్ధం ప్రారంభమైన తర్వాత కథ లేకుండా సన్నివేశాలు అక్కడక్కడే తిరుగుతున్న భావన కలుగుతుంది. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి.
Details
వెంకటేష్ ఎంట్రీ సూపర్
వెంకటేశ్ ఎంట్రీతో మళ్లీ సినిమా ఊపందుకుంటుంది. కథను పక్కన పెట్టి చిరంజీవి-వెంకటేశ్ జోడీని చూడటంలో ప్రేక్షకుడు మునిగిపోతాడు. ఒకరి పాటకు మరొకరు స్టెప్పులు వేయడం, ఎమ్.ఎమ్.ఎస్ అంటూ సాగే ఫ్లాష్‌బ్యాక్, సంక్రాంతి పాటతో మాస్ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించారు. భార్యాభర్తల బంధాన్ని ప్రతిబింబించే కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. లాజిక్స్ గురించి ఆలోచించకుండా ఈ సినిమాను ఆస్వాదిస్తే మంచి వినోదం లభిస్తుంది. కడుపుబ్బా నవ్వించకపోయినా, సరదాగా చూసేందుకు మాత్రం లోటు లేదు.