Sardar2 : కార్తీ 'సర్దార్ 2' విడుదల తేదీ ఖరారు.. మరింత భారీ స్థాయిలో యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ సినీ ప్రేక్షకులతో పాటు దక్షిణాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్ 2' విడుదల తేదీ అధికారికంగా రిలీజ్ చేశారు. దర్శకుడు పి.ఎస్. మిత్రన్ తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం 'సర్దార్'కు కొనసాగింపుగా రూపొందుతున్న ఈ సీక్వెల్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొంతకాలంగా చిత్రీకరణ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్, కార్తీ ఇతర కమిట్‌మెంట్ల కారణంగా ఆలస్యమైనప్పటికీ ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. భారీ వ్యయంతో, అత్యాధునిక యాక్షన్ సన్నివేశాలతో రూపొందుతున్న ఈ చిత్రం 2026 సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చర్చలు మరింత వేగం పుంజుకున్నాయి.
వివరాలు
ఏజెంట్ సర్దార్ పాత్రలో కార్తీ..
కార్తీ కెరీర్‌లో మరో కీలక చిత్రంగా భావిస్తున్న ఈ స్పై థ్రిల్లర్‌ను తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని నిర్మాతలు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉండగా, జూన్ నెలలో షూటింగ్ పూర్తిచేసి అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను వేగంగా ముగించి నిర్ణీత తేదీకే సినిమాను విడుదల చేసేలా చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది. ఈ చిత్రంలో కార్తీ మరోసారి శక్తివంతమైన 'ఏజెంట్ సర్దార్' పాత్రలో కనిపించనున్నారు.
వివరాలు
సినిమాపై భారీ అంచనాలు..
'మిషన్ ఆఫ్ ఎ లైఫ్ టైమ్' అనే ట్యాగ్‌లైన్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా, తొలి భాగంతో పోలిస్తే మరింత భారీ యాక్షన్, ఉత్కంఠభరితమైన కథనం, బలమైన భావోద్వేగాలు, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో అలరించనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ ఆధ్వర్యంలో ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఎస్.జె. సూర్య ప్రతినాయకుడి పాత్రలో నటిస్తుండగా, మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. సంగీత దర్శకుడు శ్యామ్ సి.ఎస్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.