Loading...
Scene Movie Review: సీన్ మూవీ రివ్యూ.. సూర్య నటన అదుర్స్.. కామెడీతో కూడిన మైండ్ గేమ్!
సీన్ మూవీ రివ్యూ.. సూర్య నటన అదుర్స్.. కామెడీతో కూడిన మైండ్ గేమ్!

Scene Movie Review: సీన్ మూవీ రివ్యూ.. సూర్య నటన అదుర్స్.. కామెడీతో కూడిన మైండ్ గేమ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 06, 2026
03:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

వరుస విజయాలతో జోరు మీదున్న కోలీవుడ్ స్టార్ సూర్య.. ఒకే ఏడాది మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కించిన ఈ చిత్రమే 'సీన్'. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌కు కామెడీ, మాస్ ఎలిమెంట్స్ జోడించి రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? సూర్య నటన ఎలా ఉంది? కథ, కథనం, సాంకేతిక అంశాలపై పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.

వివరాలు

ఆసక్తికరంగా కథ

ప్రేమ్ రాజ్ (సూర్య) నేరాలను ఇట్టే పసిగట్టగల తెలివైన పోలీస్ ఆఫీసర్. నేర పరిశోధనలో షెర్లాక్ హోమ్స్‌ను తలపించే అతడికి ఓ పెద్ద బలహీనత ఉంటుంది.

అయితే ఆ విషయం ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో తన పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేస్తూ లేఖ పంపిస్తాడు. కానీ అతడి పై అధికారి (లాల్) మాత్రం ఆ రాజీనామాను అంగీకరించడు.

మరోవైపు ఈశ్వరన్ (నస్లెన్) అత్యంత తెలివైన సీరియల్ కిల్లర్. డబ్బు కోసం హత్యలు చేసే కాంట్రాక్ట్ కిల్లర్‌గానూ అతడు వ్యవహరిస్తుంటాడు.

అలాంటి ప్రమాదకరమైన హంతకుడిని తనకున్న బలహీనతను పక్కనపెట్టి ప్రేమ్ రాజ్ ఎలా పట్టుకున్నాడు? ఈ కేసు దర్యాప్తులో మాయ (నజ్రియా నజీమ్) అతడికి ఎలా సహాయం చేసింది?

వివరాలు

బలహీనత అంశాల చుట్టూ కథ

ప్రేమ్ రాజ్, మాయ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అసలు ప్రేమ్ రాజ్‌కు ఉన్న బలహీనత ఏంటి? అనే అంశాల చుట్టూ సినిమా కథ సాగుతుంది.

'రోమాంచం', 'ఆవేశం' వంటి సినిమాలతో హారర్, గ్యాంగ్‌స్టర్ జానర్లకు కొత్తదనాన్ని పరిచయం చేసిన దర్శకుడు జీతూ మాధవన్.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను ఎంచుకున్నారు. ఈ జానర్‌లోనూ అద్భుతమైన వినోదాన్ని పండించారు.

సాధారణంగా సీరియల్ కిల్లర్ కథ అనగానే 'రాక్షసన్' తరహాలో భయపెట్టే, హింసాత్మకమైన సన్నివేశాలు ఉంటాయని ప్రేక్షకులు భావిస్తారు.

కానీ ఈ సినిమా అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. కామెడీ, మాస్ ఎలిమెంట్స్‌ను జోడిస్తూ కథను చాలా కూల్‌గా ముందుకు తీసుకెళ్లారు.

ADVERTISEMENT

వివరాలు

ఎక్కువ భాగాన్ని హీరో ఇంట్లోనే చిత్రీకరణ

హీరో తన దర్యాప్తు కోసం ఎంచుకున్న టీమ్‌లో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక లోపం ఉండటం ఈ సినిమాలోని ప్రత్యేకత. హీరోయిన్ నజ్రియా ఫహాద్ పాత్రకు కూడా ఓ మైనస్ ఉంటుంది.

అయినప్పటికీ ఆమె హీరోకు కళ్లులా మారి కేసు దర్యాప్తులో సహాయపడుతుంది. హీరో తల్లిదండ్రులు సైతం వైకల్యంతో బాధపడుతుంటారు.

ఇలా విభిన్నమైన లోపాలు ఉన్న పాత్రలతోనే దర్యాప్తు ప్రక్రియను సరదాగా నడిపించారు. భారీ సెట్టింగులు, ఎక్కువ లొకేషన్ల జోలికి వెళ్లకుండా దర్శకుడు కథలో ఎక్కువ భాగాన్ని హీరో ఇంట్లోనే నడిపించారు.

ఈశ్వరన్ నేరాలకు పాల్పడే విధానం కూడా చాలా సాధారణంగా ఉన్నప్పటికీ.. తెరపై మాత్రం ప్రభావవంతంగా కనిపిస్తుంది.

ADVERTISEMENT

వివరాలు

కామెడీ సన్నివేశాలు అద్భుతం

అయితే సినిమా ప్రారంభమైన కొంతసేపు కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. లాల్‌తో వచ్చే కామెడీ సన్నివేశాలు మాత్రం బాగా నవ్విస్తాయి.

హీరోకు ఉన్న బలహీనత ఏమిటో వెల్లడయ్యే దగ్గరి నుంచి కథనం వేగం పుంజుకుంటుంది. ఆ తర్వాత సీరియల్ కిల్లర్‌కు, పోలీసులకు మధ్య నడిచే క్యాట్ అండ్ మౌస్ గేమ్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది.

అనవసరమైన హంగామా లేకుండానే హీరో, హీరోయిన్లకు విజిల్స్ వేయించే స్థాయిలో మాస్ ఎలివేషన్స్ ఇవ్వడం మరో ప్రధాన ఆకర్షణ.

వివరాలు

నటీనటులు

సూర్య ఈ సినిమాలో చాలా రిలాక్స్‌డ్‌గా కనిపిస్తూ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఆయన గతంలో నటించిన 'కాక కాక', 'సింగం', 'సెవెంత్ సెన్స్', 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' సినిమాలకు సంబంధించిన రిఫరెన్సులు అభిమానులను అలరిస్తాయి.

అయితే అవి ఎక్కడా అతిగా అనిపించకుండా కథలో సహజంగా ఇమిడిపోయాయి. సీరియల్ కిల్లర్ ఈశ్వరన్ పాత్రలో నస్లెన్ చాలా కూల్‌గా, సహజంగా నటించారు. తన నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే సర్‌ప్రైజింగ్ ప్యాకేజ్‌గా నిలిచారు.

మాయ పాత్రలో నజ్రియా ఫహాద్ తన పాత్రకు పూర్తిన్యాయం చేశారు. ఆమెకు కూడా సినిమాలో ఓ అదిరిపోయే మాస్ సీన్ దక్కింది.

హీరో తండ్రి పాత్రలో 'పెదరాయుడు' ఫేమ్ ఆనందరాజ్‌తో పాటు మిగతా నటీనటులంతా తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.

వివరాలు

టెక్నికల్ టీమ్

సంగీత దర్శకుడు సుషిన్ శ్యామ్‌కు ఇది తొలి తమిళ సినిమా. సాధారణంగా సీరియల్ కిల్లర్ సినిమాల్లో వినిపించే హడావుడి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు భిన్నంగా.. ఈ చిత్రానికి చాలా ప్రశాంతమైన సంగీతాన్ని అందించారు. అజ్మల్ సబు ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది.

అయితే ఫస్టాఫ్‌లో అక్కడక్కడా కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. వినీత్ అగస్త్యన్ సినిమాటోగ్రఫీ టాప్ నాచ్‌లో ఉంది.

దర్శకుడు జీతూ మాధవన్ తనదైన శైలిలో కథను తెరకెక్కించి, ఈ ఏడాది వచ్చిన బెస్ట్ తమిళ సినిమాల్లో ఒకటిగా 'సీన్'ను నిలబెట్టారు.

తక్కువ లొకేషన్లతోనే అద్భుతమైన అవుట్‌పుట్ తీసుకురావడంలో సాంకేతిక బృందం ప్రతిభ స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా కామెడీ, ఇన్వెస్టిగేషన్, థ్రిల్లింగ్ అంశాలతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ADVERTISEMENT