LOADING...
Shambhala Review: దేవుడు vs సైన్స్ పోరులో 'శంబాలా' ఎంతవరకు సక్సెస్ అయ్యింది?
దేవుడు vs సైన్స్ పోరులో 'శంబాలా' ఎంతవరకు సక్సెస్ అయ్యింది?

Shambhala Review: దేవుడు vs సైన్స్ పోరులో 'శంబాలా' ఎంతవరకు సక్సెస్ అయ్యింది?

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 25, 2025
11:34 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ 'శంబాలా: ఏ మిస్టికల్ వరల్డ్'. దేవుడి శక్తి, సైన్స్ మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్రానికి ప్రధాన అంశం. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో ఇప్పుడు వివరంగా చూద్దాం.

వివరాలు 

కథ 

1980ల కాలంలో శంభాల అనే ఓ మారుమూల గ్రామంలో ఆకాశం నుంచి ఓ ఉల్క భూమిపై పడుతుంది. ఆ ఘటన తర్వాత ఆ ఊరిలో వరుసగా వింత సంఘటనలు చోటుచేసుకుంటాయి. గ్రామస్తులు దీన్ని బండ భూతం ప్రభావంగా భావించి,ఉల్క పడిన కారణంగా ఊరికి అపశకునం పట్టిందని నమ్ముతారు. ఆ భయాల మధ్యలోనే గ్రామంలో వరుస మరణాలు జరగడం వారి అనుమానాలను మరింత బలపరుస్తుంది. ఈ పరిస్థితుల్లో ఆ గ్రామానికి ఓ శాస్త్రవేత్త (ఆది సాయికుమార్)వస్తాడు. అసలు నిజం ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో అతడికి దేవి (అర్చన అయ్యర్)సహాయం చేస్తుంది. ఆ ఉల్కకు,శివుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆ గ్రామంలో జరుగుతున్న అద్భుతాల వెనుక అసలు రహస్యం ఏమిటన్నదే కథలో కీలక అంశం.

వివరాలు 

కథనం:

దేవుడు-సైన్స్ మధ్య పోరాటం అన్న అంశం ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తుందనే విషయాన్ని దర్శకుడు యుగంధర్ ముని బాగా వినియోగించుకున్నాడు. సైన్స్‌నే నమ్మే హీరోకి,దానికంటే మించిన శక్తి ఉందని విశ్వసించే గ్రామస్తుల మధ్య నడిచే కథే 'శంబాలా'. సినిమా ప్రారంభం నుంచే దర్శకుడు కథను ఆసక్తికరంగా నడిపించాడు. మొదటి పది నిమిషాల్లోనే ప్రధాన కథను స్పష్టంగా చెప్పేయడం ప్లస్ అయింది. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు కూడా క్యూరియాసిటీని కొనసాగిస్తాయి. ఇంటర్వెల్ వరకు కథ ఎటు వెళ్లబోతోందో అన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో నిలిచిపోతుంది. రెండో భాగంలో అసలు మిస్టరీ బయటపడిన తర్వాత కథనం మరింత వేగం పుంజుకుంటుంది. సైన్స్‌కు మించిన శక్తి ఉందని సూచించే సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతాయి.

Advertisement

వివరాలు 

నటీనటులు:

దుష్టశక్తులు ఆవహించిన శరీరం చేసే విచిత్ర ప్రవర్తన, వాటిని అడ్డుకోవడానికి గ్రామస్తులు పడే ఇబ్బందులు,ఈ మొత్తం వ్యవహారంలో హీరో చేసే ప్రయత్నాలు,ఎవరికీ తెలియకుండా దేవత అందించే సహాయం వంటి అంశాలు సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. క్లైమాక్స్‌ను దర్శకుడు బాగా ప్లాన్ చేశాడు. ప్రేక్షకుల్లో ఏర్పడిన ఉత్కంఠకు సంతృప్తికరమైన ముగింపును ఇచ్చాడు. ఆది సాయికుమార్‌కు ఇది చాలా రోజుల తర్వాత వచ్చిన మంచి కమ్‌బ్యాక్ సినిమా అని చెప్పవచ్చు. తన పాత్రలో ఆయన మెచ్యూరిటీతో నటించాడు. అర్చన అయ్యర్, మధునందన్ పాత్రలు కథకు బలంగా నిలిచాయి. శ్వాసిక విజయ్, మధునందన్, ఆనంద్, సిజ్జు తదితరులు తమ పాత్రల పరిధిలో బాగా నటించారు.

Advertisement

వివరాలు 

సాంకేతిక విభాగం:

శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం సినిమాకు సరైన మూడ్‌ను ఇచ్చింది. ప్రవీణ్ కే బండారి సినిమాటోగ్రఫీ ఆకట్టుకునేలా ఉంది. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది. కథ అవసరాలకు తగ్గట్టుగా నిర్మాతలు ఖర్చు పెట్టారు. మొత్తంగా దర్శకుడు యుగంధర్ ముని ఒక మంచి కాన్సెప్ట్‌ను ఎంచుకుని దాన్ని సమర్థంగా తెరపైకి తీసుకొచ్చాడు. పంచ్ లైన్: ఓవరాల్ గా శంబాల.. ఇంట్రెస్టింగ్ మిస్టిక్ థ్రిల్లర్..!

Advertisement