Sankarabharanam: తెలుగు సినిమా కీర్తి కిరీటం.. నాలుగున్నర దశాబ్దాలు పూర్తి చేసుకున్న 'శంకరాభరణం'
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ సినీ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన కళాత్మక చిత్రం 'శంకరాభరణం' 1980 ఫిబ్రవరి 2న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విడుదలైంది. ఈ చిత్రం నేటికి 45 ఏళ్లు పూర్తి చేసుకుంది.
కళాతపస్వి శ్రీ కే. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో, పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీ ఏడిద నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములు నిర్మించారు.
ఈ చిత్రం అపూర్వ విజయాన్ని సాధించడమే కాకుండా, తమిళనాడు, కర్ణాటక, కేరళల్లోనూ అఖండ విజయం సాధించింది.
అంతేకాదు, అప్పట్లోనే పాన్ ఇండియా మూవీగా గుర్తింపు పొందింది. 'శంకరాభరణం' అమెరికాలో రెగ్యులర్ థియేటర్లలో విడుదలైన మొట్టమొదటి భారతీయ చిత్రం కావడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రదర్శితమై, తెలుగు సినిమా ప్రాముఖ్యతను అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పింది.
Details
జాతీయ అవార్డు అందుకున్న తొలి చిత్రంగా గుర్తింపు
శాస్త్రీయ సంగీతానికి ఆదరణ తగ్గిన రోజుల్లో విడుదలైన ఈ చిత్రం, ఎంతో మంది శాస్త్రీయ సంగీతం పట్ల ఆసక్తి పెంచేలా చేసింది. అప్పుడు ప్రతి ఒక్కరి నోటా 'శంకరాభరణం' గురించే చర్చ.
ప్రతి తెలుగు వాడు ఈ సినిమాను మా సినిమా అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి. అవార్డుల పరంగా ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలిచింది.
జాతీయ అవార్డులలో కళాత్మక విలువలతో కూడిన ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా 'స్వర్ణ కమలం' అవార్డును సాధించింది.
ఇది తెలుగులో ఆ అవార్డును అందుకున్న తొలి చిత్రం. శ్రీ ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం ఉత్తమ నేపథ్య గాయకుడిగా తన తొలి జాతీయ అవార్డును అందుకున్నారు.
Details
జాతీయ అవార్డు అందుకున్న మహదేవన్
వాణి జయరాం ఉత్తమ గాయకురాలిగా, కే.వి. మహదేవన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులను గెలుచుకున్నారు.
అంతర్జాతీయ స్థాయిలోనూ 'శంకరాభరణం' గొప్ప గుర్తింపు సాధించింది. ఫ్రాన్స్‌లోని Besancon ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రంగా అవార్డును గెలుచుకుంది.
అంతేకాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డుల్లో 8 అవార్డులను గెలుచుకుంది. దేశవ్యాప్తంగా అనేక సాంస్కృతిక సంస్థలు ఈ చిత్ర బృందాన్ని సత్కరించాయి.
ప్రముఖ వక్త చాగంటి కోటేశ్వరరావు ఈ చిత్రంపై ప్రత్యేకంగా మూడు రోజుల పాటు ప్రవచనాలు నిర్వహించడం విశేషం. ఓ సినిమాపై ప్రవచనం నిర్వహించటం ఇదే తొలిసారి.
ఈ చిత్రంలోని పాత్రలు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
Details
'శంకరాభరణం శంకరశాస్త్రి'గా ప్రేక్షకుల మదిలో నిలిచిన జె.వి.సోమయాజులు
జె.వి. సోమయాజులు 'శంకరాభరణం శంకరశాస్త్రి'గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు.
ప్రముఖ హాస్య నటుడు శ్రీ అల్లు రామలింగయ్య ఇందులో ఓ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలోని పాటలు భాషతో సంబంధం లేకుండా ఇప్పటికీ అందరూ పాడుకుంటూనే ఉంటారు.
ఈ సినిమా నిర్మాత శ్రీ ఏడిద నాగేశ్వరరావు, తాను చెన్నై, హైదరాబాద్‌లలో నిర్మించిన ఇళ్లకు 'శంకరాభరణం' అనే పేరు పెట్టడం, ఆయనకు ఈ చిత్రంపై ఉన్న ప్రేమకు నిదర్శనం.