Tamil Heros : తమిళ స్టార్ హీరోలకు షాక్.. నిర్మాతల మండలి కొత్త రూల్స్!
ఈ వార్తాకథనం ఏంటి
సినీ పరిశ్రమలో ఎవరికైనా నిర్మాణ పరమైన సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించడంలో ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమలో నిర్మాతల మండలి జోక్యం ఎప్పుడూ గట్టిగానే ఉంటుంది. తరచూ ఏదో ఒక హీరో లేదా చిత్ర బృందానికి వార్నింగ్‌లు జారీ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి తమిళ నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా నిర్వహించిన సమావేశంలో నిర్మాతల మండలి నటీనటులపై పలు ముఖ్య నిర్ణయాలు తీసుకుంది. వీటిలో మూడు తీర్మానాలు మాత్రం స్టార్ హీరోలు, హీరోయిన్స్‌కు గట్టి దెబ్బగా మారాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
Details
తమిళ నిర్మాతల మండలి తీసుకున్న ప్రధాన నిర్ణయాలు
ఇకపై స్టార్ హీరోలు ముందుగానే రెమ్యునరేషన్ తీసుకోవడం మానుకోవాలి. సినిమాకు వచ్చిన మొత్తం ఆదాయంలో వాటా తీసుకోవాలి. సినిమా నష్టపోతే ఆ నష్టాన్ని కూడా భరించాలి. స్టార్ హీరోలు, హీరోయిన్స్‌తో పాటు సాంకేతిక నిపుణులు ఎలాంటి వెబ్‌సిరీస్‌లలోనూ నటించకూడదు. డిజిటల్ కంటెంట్ ప్రాజెక్ట్‌లలో పాల్గొనడాన్ని పూర్తిగా నిషేధించారు. స్టార్ నటీనటులు బయట ప్రైవేట్ ఈవెంట్స్, మ్యూజిక్ షోలు లేదా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొనాలంటే తమిళ నిర్మాతల మండలి, ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి.
Details
తమిళ సినీ వర్గాల్లో తీవ్ర చర్చ
ఈ నిర్ణయాలపై ఇప్పటికే తమిళ సినీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. హీరోలు రెమ్యునరేషన్ కాకుండా రెవెన్యూ షేర్ తీసుకోవడం ఆర్థికంగా సమంజసమే అని కొందరు భావించినా, నటీనటుల వ్యక్తిగత స్వేచ్ఛపై ఇలాంటి నియంత్రణలు విధించడం సరైంది కాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడ నటించాలి, ఏ ఈవెంట్‌లో పాల్గొనాలి, ఏది చేయకూడదని నిర్మాతల మండలి నిర్ణయించడం అతిగా ఉందని కొందరు పేర్కొంటున్నారు. నెటిజన్లు కూడా ఈ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఇవి సాధ్యంకాని నిర్ణయాలు, నటీనటుల స్వాతంత్ర్యాన్ని కట్టడి చేసే ప్రయత్నం ఇది అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇక దీనిపై స్టార్ హీరోలు, హీరోయిన్‌లు స్పందిస్తారా లేదా అన్నది ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.