
Tollywood Bundh : షూటింగ్స్ బంద్ ప్రభావం.. రవితేజ 'మాస్ జాతర' రిలీజ్ వాయిదా!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో స్టార్ హీరోల సినిమాల నుండి డెబ్యూ హీరోల చిత్రాల వరకు అన్ని చోట్లా షూటింగ్స్ నిలిచిపోయాయి. కొన్ని స్టార్ హీరోల సినిమాలు ఈ నెలలో విడుదల తేదీలను ఖరారు చేసుకున్నప్పటికీ, బంద్ కారణంగా అవి కూడా వాయిదా పడే పరిస్థితి ఏర్పడింది. బంద్ మొదలైన రోజుల్లో ఒకటి రెండు రోజుల్లో పరిస్థితి సర్దుకుంటుందని నిర్మాతలు భావించి రిలీజ్ డేట్స్ పెట్టారు. అయితే ఇప్పటికే 14 రోజులు గడిచినా బంద్ కొనసాగుతూనే ఉంది. ఇది ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేదు. బంద్ ప్రభావంతో వాయిదా పడుతున్న మొదటి సినిమా మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న 'మాస్ జాతర'.
Details
త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం
భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం మాంటేజ్ సాంగ్, కొంత ప్యాచ్ వర్క్ షూట్ పెండింగ్‌లో ఉన్నాయి. ముందుగా రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ఈ పనులు ఒక వారంలో పూర్తయ్యాల్సింది. కానీ కార్మిక సంఘాలు షూటింగ్స్‌పై బంద్ ప్రకటించడంతో ఆగిపోయాయి. ఇక మరోవైపు 'మాస్ జాతర'ను ఈ నెల 27న రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. కానీ బంద్ కారణంగా ఆ విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. దీపావళి కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నప్పటికీ, షూటింగ్స్ ఎప్పుడు పునఃప్రారంభమవుతాయో తెలియకపోవడంతో కొత్త రిలీజ్ డేట్‌పై స్పష్టత లేదు.