Manchu Vishnu: కిడ్నాప్ ఆరోపణల కేసులో 'మా' అధ్యక్షుడు అరెస్టు తప్పదా?
ఈ వార్తాకథనం ఏంటి
తిరుపతిలో సంచలనం సృష్టించిన విద్యార్థి నేతల అపహరణ కేసులో టాలీవుడ్ హీరో 'మా' అధ్యక్షుడు మంచు విష్ణుకు చంద్రగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీపై నిరసన తెలిపేందుకు వెళ్తున్న ఎస్‌ఎఫ్‌ఐ (SFI) నాయకులను కిడ్నాప్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని ఈ నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేశారు. ఈ కిడ్నాప్ కేసులో యూనివర్సిటీ పీఆర్‌ఓ సతీష్‌ను ఏ-1గా, నటుడు మంచు విష్ణును ఏ-2గా, ఆయన తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబును ఏ-3గా ఎఫ్‌ఐఆర్‌లో కీలక నిందితులుగా పోలీసులు చేర్చారు. ఇప్పటికే ఈ కేసులో పీఆర్‌ఓ సతీష్‌తో పాటు పలువురు బౌన్సర్లను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
Details
కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు
బాధితుల వాంగ్మూలాలు, ప్రాథమిక ఆధారాల ఆధారంగా యూనివర్సిటీ యాజమాన్యం ప్రోద్బలంతోనే ఈ అపహరణ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ మంచు మోహన్ బాబు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ కేసు వెనుక రాజకీయ కుట్ర ఉందని, తమ విద్యాసంస్థల ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరు కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంచు కుటుంబం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణకు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.