Singeetham Srinivasa Rao : సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత.. తెలుగు సినిమా ప్రయోగశాలకు ఇక తెరపడినట్లే!
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినిమాకు తనదైన ప్రయోగాలతో తిలకం అద్దిన గొప్ప దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు గారు ఒకరు. 1931 సెప్టెంబరు 21న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించిన ఆయన.. సినీ రంగంలో తనదైన ముద్రను వేశారు. సింగీతం తండ్రి హెడ్‌మాస్టర్‌గా పనిచేయగా.. తల్లి వయొలిన్ వాయిద్య నిపుణురాలు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుతున్న సమయంలోనే ఆయనకు నాటకరంగంతో పరిచయం ఏర్పడింది. అదే సమయంలో హాలీవుడ్ సినిమాలను కూడా విస్తృతంగా చూసేవారు. సినిమాలపై ఉన్న మక్కువతో తనకు అత్యంత ఇష్టమైన దర్శకుడు కె.వి.రెడ్డి వద్ద అప్రెంటిస్‌గా సింగీతం శ్రీనివాసరావు తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. అనంతరం అసోసియేట్ డైరెక్టర్‌గా 'దొంగ రాముడు', 'మాయాబజార్', 'జగదేకవీరుని కథ', 'శ్రీ కృష్ణార్జున యుద్ధం' వంటి సినిమాలకు పనిచేశారు.
వివరాలు
తెలుగు సినిమా స్థాయిని పెంచారు
1972లో 'నీతి నిజాయితీ' సినిమాతో దర్శకుడిగా తన తొలి తెలుగు చిత్రాన్ని తెరకెక్కించి.. అప్పుడే తనదైన ముద్రను చాటుకున్నారు.
'మయూరి', 'ఆదిత్య 369', 'భైరవ ద్వీపం' వంటి సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచారు. సాధారణ కథనాలకు భిన్నంగా ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో సినిమాలు రూపొందించడం సింగీతం ప్రత్యేకతగా నిలిచింది.
'పుష్పక విమానం'తో మూకీ సినిమాను తెరకెక్కించడం, 'ఆదిత్య 369'లో టైమ్ మెషిన్ ద్వారా వర్తమాన కాలం నుంచి భవిష్యత్ కాలానికి వెళ్లే ఆలోచనను తెరపై ఆవిష్కరించడం, 'సింగ్ గీతం' సినిమాతో పాటలనే మాటలుగా ఉపయోగిస్తూ సినిమా చేయడం వంటి ఎన్నో ప్రయోగాలతో వెండితెరపై అద్భుతాలను సృష్టించారు.
సింగీతం సినిమాల్లో ప్రయోగాత్మకతకు ప్రత్యేక స్థానం ఉండేది.
వివరాలు
మయూరి మూవీకి 14 నంది అవార్డులు
సుధాచంద్రన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన 'మయూరి' సినిమా సూపర్‌హిట్‌గా నిలవడమే కాకుండా ఏకంగా 14 నంది అవార్డులను గెలుచుకుంది.
'భైరవ ద్వీపం' సినిమాకు ఉత్తమ దర్శకుడిగా సింగీతం శ్రీనివాసరావు నంది అవార్డును అందుకున్నారు.
తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో సుమారు 60 సినిమాలకు పనిచేసిన ఆయన.. 'సింగీతం అంటే ప్రయోగం.. ప్రయోగం అంటే సింగీతం' అనే స్థాయిలో గుర్తింపు పొందారు.
94 ఏళ్ల వయసులోనూ ఇటీవల 'సింగ్ గీతం' అనే సినిమాకు దర్శకత్వం వహించి తనకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు.
తాను ఎప్పటికీ రిటైర్మెంట్ తీసుకోనని చెప్పిన సింగీతం.. తన సినిమాల్లోని వైవిధ్యం ఏ స్థాయిలో ఉంటుందో నేటి జెన్ జీ జనరేషన్‌కు కూడా చూపించారు.
వివరాలు
అనారోగ్యంతో మృతి
అయితే గత కొద్దిరోజులుగా వయోభారంతో కూడిన అనారోగ్యంతో బాధపడుతున్న సింగీతం శ్రీనివాసరావు.. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో కన్నుమూశారు.
మానవ జన్మ అన్నాక ఏదో ఒక రోజు కాలం చేయాల్సిందే.
కానీ అందరిలా వెళ్లిపోతే ఆయన సింగీతం ఎందుకు అవుతారు. తాను ఎంచుకున్న కళారంగంలో కనీవినీ ఎరుగని సినిమాలను రూపొందిస్తూ, ఎవ్వరూ చేయని ప్రయోగాలను వెండితెరపై ఆవిష్కరిస్తూ కళామతల్లి ముద్దుబిడ్డగా జేజేలు అందుకున్నారు.
సింగీతం శ్రీనివాసరావు మన మధ్య లేకపోయినా.. ఆయన తీసిన సినిమాలు, చేసిన ప్రయోగాల రూపంలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు.
దశాబ్దాలుగా సినిమా అనే కళారంగంలో ప్రయోగాలకు చిరునామాగా నిలిచిన ఆయన.. తనదైన శైలిలో ఒక ప్రత్యేకమైన ప్రయోగశాలను నిర్మించుకున్నారు. ఇక ఆయన మరణంతో ఆ ప్రయోగశాల నేటి నుంచి మూతపడినట్లైంది.