Dhurandhar: సింగిల్ లాంగ్వేజ్‌లో రికార్డు వసూళ్లు.. 'ధురంధర్' సరికొత్త చరిత్ర
ఈ వార్తాకథనం ఏంటి
ఎలాంటి ముందస్తు హడావిడీ లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ధురంధర్' (Dhurandhar) చిత్రం ఊహించని స్థాయిలో భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైనప్పటి నుంచే విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ఈ సినిమా, తాజాగా మరో చారిత్రక మైలురాయిని తన ఖాతాలో వేసుకుంది. ఒకే భాషలో విడుదలై, దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'ధురంధర్' రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది.
వివరాలు
రాబోయే అనేక చిత్రాలకు 'ధురంధర్' స్ఫూర్తి
''భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే క్షణాలివి. సింగిల్ లాంగ్వేజ్‌లో విడుదలై అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'ధురంధర్' చరిత్ర లిఖించింది. దర్శకుడు ఆదిత్యధర్‌తో పాటు ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ అభినందనలు.కథపై ఆదిత్యధర్ చూపించిన నమ్మకం, దాన్ని ప్రేక్షకులకు స్పష్టంగా వివరించిన తీరు, ఆయన అచంచలమైన నిబద్ధత భారతీయ సినిమాకు కొత్త ప్రమాణాలను నెలకొల్పాయి. రాబోయే అనేక చిత్రాలకు 'ధురంధర్' స్ఫూర్తిగా నిలుస్తుంది'' అని నిర్మాణ సంస్థ తన పోస్ట్‌లో పేర్కొంది.
వివరాలు
తొలి రోజున దేశవ్యాప్తంగా రూ.28.60 కోట్లు
విడుదలైన నెల రోజుల్లోనే 'ధురంధర్' భారతదేశంలో రూ.831.40 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. భారతీయ చలనచిత్ర చరిత్రలో కేవలం ఒకే భాషలో విడుదలై ఈ స్థాయి వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది. అంతేకాదు, ఈ ఘనతను కేవలం 30 రోజుల్లోనే సాధించడం విశేషం. బాక్సాఫీస్ ప్రయాణం విషయానికి వస్తే.. తొలి రోజున దేశవ్యాప్తంగా రూ.28.60 కోట్ల వసూళ్లతో ప్రారంభమైన ఈ సినిమా, ఆ తర్వాత నెమ్మదిగా వేగం పెంచుకుంది. మొదటి వారం పూర్తయ్యే సరికి రూ.218 కోట్ల మార్కును దాటగా, రెండో వారం చివరికి రూ.479.50 కోట్లతో సంచలనం సృష్టించింది.
వివరాలు
నెల రోజులు గడిచినా తగ్గని 'ధురంధర్' క్రేజ్
15వ రోజుకే రూ.500 కోట్ల వసూళ్లను అందుకొని ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. నెల రోజులు గడిచినా కూడా 'ధురంధర్' క్రేజ్ తగ్గలేదు. 32వ రోజు రూ.5.40 కోట్లు, 33వ రోజు రూ.5.70 కోట్లు వసూలు చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే, ఇప్పటివరకు ఈ సినిమా మొత్తం రూ.1,220 కోట్ల వసూళ్లను నమోదు చేసి బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.