Dhandoraa Review: కుల అహంకారానికి ఎదురెళ్లిన కథ.. 'దండోరా' ఎలా ఉందంటే
ఈ వార్తాకథనం ఏంటి
క్రిస్మస్ వారాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాల్లో మొదటినుంచే ప్రత్యేకంగా నిలిచింది 'దండోరా'. ఇందులోని తారాగణం, కథా నేపథ్యం, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. కథానాయికల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత ఈ సినిమాకు మరింత ప్రచారం లభించింది. బుధవారం ప్రత్యేక ప్రదర్శనలతోనే విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు, ముందుగా కథ ఏంటో చూద్దాం.
వివరాలు
కథ ఏమిటంటే..
తెలంగాణలోని తుళ్లూరు అనే పల్లెటూరులో కుల వివక్ష బాగా వేళ్లూనుకుపోయి ఉంటుంది. అదే ఊరిలో అగ్రకులానికి చెందిన మోతుబరి శివాజీ(శివాజీ)కూడా వివక్షకు గురవుతాడు. తన కుమారుడు విష్ణు(నందు)తోనూ ఆయనకు సంబంధాలు బాగుండవు. చివరకు శివాజీ మరణించిన తర్వాత కూడా ఆయనకు అవమానమే ఎదురవుతుంది. కుల సంఘం నిర్ణయంతో తమ శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు చేయడానికి అనుమతి ఇవ్వరు. అసలు అగ్రకులానికి చెందిన శివాజీని కుల పెద్దలు ఎందుకు బహిష్కరించారు?శివాజీకి,శ్రీలత (బిందు మాధవి)కి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఊరిలో తక్కువ కులానికి చెందిన రవి(రవికృష్ణ)హత్య తర్వాత చోటుచేసుకున్న పరిణామాలేంటి? శివాజీ అంత్యక్రియల విషయంలో ఏర్పడిన సంఘర్షణపై ఆయన కుటుంబ సభ్యులు,గ్రామ సర్పంచ్ (నవదీప్)తీసుకున్న నిర్ణయం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెరపైనే చూడాల్సిందే.
వివరాలు
సినిమా ఎలా ఉందంటే..
సమాజంలో పాతుకుపోయిన కుల వివక్ష, అసమానతలను ప్రస్తావిస్తూ ఇటీవల తమిళ దర్శకులు ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు. ఆ చిత్రాలు తెలుగులోనూ విడుదలై మంచి ఆదరణ పొందుతున్నాయి. తెలుగులో కూడా ఈ తరహా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత కొన్నేళ్లను చూస్తే పలాస 1978,లవ్ స్టోరీ, తాజాగా వచ్చిన కోర్ట్ సినిమా వరకూ ఈ కోణం కనిపిస్తుంది. కొత్త దర్శకుడు మురళీకాంత్ 'దండోరా'తో ఇదే బాటలో మరో ప్రయత్నం చేశారు. కుల వివక్ష నేపథ్యాన్ని కొత్త కోణంలో చూపించిన తీరు ఈ సినిమాకు ప్రధాన బలం. 2004 నుంచి 2019 వరకూ సాగే ఈ కథ ఆరంభ సన్నివేశాల నుంచే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దర్శకుడు చెప్పాలనుకున్న విషయంలోని లోతును స్పష్టంగా చూపిస్తూ కథలో లీనం చేస్తాడు.
వివరాలు
సినిమా ఎలా ఉందంటే..
అయితే ఆ తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాల్లో అదే తీవ్రత కనిపించదు. ఇలాంటి కథలను వాణిజ్యపరంగా తెరకెక్కించాలంటే ఎంతో సమతౌల్యం అవసరం. ప్రథమార్థంలో పాటలు,కామెడీ కోసం చేసిన ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించకపోగా కథ గాఢతను కొంత తగ్గిస్తాయి. విరామానికి ముందు నుంచి సినిమా మళ్లీ సరైన దారిలో పడుతుంది. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు, శివాజీ పాత్రలో కనిపించే సంఘర్షణ,మార్పు సినిమాకు బలంగా నిలుస్తాయి. అయితే శివాజీ పాత్ర మార్పు సమయంలో భావోద్వేగాలు ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేదన్న భావన కలుగుతుంది. పతాక సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకు సంభాషణలే ప్రధాన బలం.
వివరాలు
ఎవరెలా చేశారంటే..
"మన చావు బతుకులు ఊరికి దూరంగానే" అంటూ ఆరంభంలో వచ్చే డైలాగ్స్ నుంచి "చావు అనేది మనిషికి ఇచ్చే ఆఖరి గౌరవం, అది గౌరవంగానే జరగాలి" వంటి సంభాషణలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. నటీనటులు ఈ సినిమాపై గట్టి ముద్ర వేశారు. ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో జీవించారు. చిన్న పాత్రలైనా సరే కథపై ప్రత్యేక ప్రభావం చూపించాయి. ముఖ్యంగా ప్రథమార్థంలో శివాజీ చేసిన హంగామా ఆయన కోర్ట్ సినిమాలోని మంగపతి పాత్రను గుర్తుకు తెస్తుంది. ద్వితీయార్థంలో శివాజీ పాత్రలో కనిపించే మార్పు ఆయన నటనా అనుభవాన్ని చాటుతుంది. శ్రీలత పాత్రలో బిందు మాధవి ఎంతో సహజంగా ఒదిగిపోయారు. ఆ పాత్రలో ఆమె నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
వివరాలు
ఎవరెలా చేశారంటే..
రవికృష్ణ, మణిక ప్రేమ జంటగా కనిపించిన తీరు సహజంగా ఉంది. సర్పంచ్‌గా నవదీప్ చేసిన నటన మరింత ఆకట్టుకుంటుంది. ప్రతి పాత్రను దర్శకుడు జాగ్రత్తగా డిజైన్ చేశారు. నందు తన నటనతో నవ్వించడమే కాకుండా భావోద్వేగాలను పండించాడు. సాంకేతిక విభాగాలు కూడా మంచి పనితీరు చూపించాయి. మార్క్ కె. రాబిన్ నేపథ్య సంగీతం, ఛాయాగ్రాహకుడు వెంకట్ ఆర్. శాఖమూరి విజువల్స్ కథలోని లోతును మరింత పెంచాయి. దర్శకుడు మురళీకాంత్ చెప్పాలనుకున్న విషయాన్ని నిజాయతీతో, బలంగా తెరపై ఉంచారు. ఆయన రచనలో స్పష్టతతో పాటు దృఢత కనిపిస్తుంది.
వివరాలు
బలాలు
+ కథ + బలమైన పాత్రలు... నటీనటుల అభినయం + సంగీతం + సంభాషణలు బలహీనతలు - ప్రథమార్ధం చివరిగా: చివరిగా: దండోరా... నిజాయతీ ప్రయత్నం గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!