Sourav Ganguly: నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సిరీస్ 'ఖాకీ 2'లో సౌరభ్ గంగూలీ.. వైరలవుతోన్న పిక్!
ఈ వార్తాకథనం ఏంటి
భారత మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ నటుడిగా వెండితెరకు ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పోలీస్ యూనిఫామ్‌లో ఆయన ఉన్న ఫొటో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం కావడం దీనికి కారణం.
దీంతో త్వరలోనే గంగూలీని తెరపై చూడొచ్చంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జీత్, ప్రోసెన్‌జిత్ ఛటర్జీ, శాశ్వత, పరంబ్రత ఛటర్జీ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'ఖాకీ: ది బెంగాల్ చాప్టర్' (ఖాకీ 2) మార్చి 20 నుంచి నెట్ ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
ఈ సిరీస్‌లో గంగూలీ అతిథి పాత్రలో కనిపించనున్నారనే వార్తలు నెటిజన్లలో ఆసక్తిని పెంచుతున్నాయి.
వివరాలు
'ఖాకీ: ది బిహార్ చాప్టర్' సిరీస్‌కు కొనసాగింపుగా..
బుధవారం జరిగిన ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత నీరజ్ పాండే చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిచ్చాయి.
'ఈ సిరీస్‌లో గంగూలీ ఉన్నారా?' అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, 'సౌరభ్ విషయానికొస్తే.. చెప్పడం ఎందుకు? చూస్తూ ఉండండి' అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు.
దీంతో మాజీ క్రికెటర్ సినీరంగ ప్రవేశం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరికొందరు మాత్రం ఇది కేవలం సిరీస్ ప్రచారానికి భాగమై ఉండొచ్చని, అందుకే ఆయన పోలీస్ యూనిఫామ్‌లో ఉన్నారని అంటున్నారు.
నెట్‌ఫ్లిక్స్‌లో గతంలో విడుదలైన 'ఖాకీ: ది బిహార్ చాప్టర్' సిరీస్‌కు ఇది కొనసాగింపుగా రూపొందించబడింది.
ప్రముఖ ఐపీఎస్ అధికారి అమిత్ లోథా జీవితంలోని నిజ ఘటనల ఆధారంగా 'బిహార్ చాప్టర్' రూపొందించబడింది.
వివరాలు
గంగూలీ పాత్రలో బాలీవుడ్ ప్రముఖ నటుడు
ఆయన రచించిన 'బిహార్ డైరీస్' పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని ఈ సిరీస్ రూపొందించారు.
2022లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ విశేషమైన ఆదరణ పొందింది. దాంతో దీని సీక్వెల్‌గా 'ఖాకీ: ది బెంగాల్ చాప్టర్' రూపొందించబడింది.
ఇదిలా ఉండగా, సౌరభ్ గంగూలీ బయోపిక్ త్వరలో వెండితెరపైకి రానున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా కోసం కొన్నేళ్లుగా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఇటీవలే ఇందులో ప్రధాన పాత్ర పోషించే హీరో కూడా ఖరారయ్యాడు.
బాలీవుడ్ ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ రావు గంగూలీ పాత్రలో నటించనున్నాడు. 'నేను విన్నంతవరకు టైటిల్ రోల్‌లో రాజ్‌కుమార్ రావు నటించనున్నాడు' అని స్వయంగా గంగూలీ వెల్లడించారు.