బాలీవుడ్ లో కంటే సౌత్ లోనే నెపోటిజం ఎక్కువ: ఉయ్యాల జంపాల హీరోయిన్ కామెంట్లు వైరల్
ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా మారిన అవికా గోర్, దక్షిణాది సినిమా మీద విపరీతమైన కామెంట్లు చేసింది. బాలీవుడ్ ఫిలిమ్ 1920 హార్రర్స్ ఆఫ్ ద హార్ట్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒకానొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, దక్షిణాది సినిమాల్లో నెపోటిజం చాలా ఎక్కువ అనీ, బాలీవుడ్ లో కంటే దక్షిణాదిలోనే ఎక్కువగా ఉందని కామెంట్స్ చేసింది. దక్షిణాది ప్రేక్షకులు కూడా నెపోటిజాన్ని సెలెబ్రేట్ చేస్తున్నారని, ముందు ముందు నెపోటిజం తగ్గుతుందేమో చూడాలని ఆమె అంది. గతకొన్ని రోజులుగా బాలీవుడ్ మీద తీవ్రమైన వివక్ష పెరిగిందని, సౌత్ సినిమాలను రీమేక్ చేస్తే, కాపీ కొడుతున్నారని చాలామంది అంటున్నారని అవికా గోర్ వ్యాఖ్యానించింది.
ఫైర్ అవుతున్న నెటిజన్లు
అవికా గోర్ చేసిన కామెంట్లపై కొందరు మండిపడుతున్నారు. అవికా గోర్ ఇప్పటివరకూ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. దక్షిణాదిన ఎక్కువ సినిమాలు చేసి, దక్షిణాది సినిమా గురించి అలా మాట్లాడటం సరికాదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా మారిన అవికా గోర్, ఆ తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా మొదలగు చిత్రాల్లో నటించి విజయాలు దక్కించుకుంది. ఇటీవల ఆమె నటించిన పాప్ కార్న్ సినిమాకు బాక్సాఫీసు వద్ద సరైన రెస్పాన్స్ రాలేదు. ప్రస్తుతం 1920 హారర్స్ ఆఫ్ ద హార్ట్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెడుతున్న అవికా గోర్, ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.