స్పై సినిమా హీరోయిన్‌కు పవన్ కళ్యాణ్ మూవీలో అవకాశం?
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్‌లో జూన్ 29వ తేదీన స్పై సినిమా రిలీజ్ అయింది. నిఖిల్ కెరీర్‌లోనే అత్యధిక మొదటి రోజు వసూళ్లు అందుకున్న ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఓపెనింగ్స్ బాగానే వచ్చినా ఆ తర్వాత రోజుల్లో స్పై అనుకున్నంతగా వసూళ్లను కలెక్ట్ చేయలేకపోతోంది. అయితే సినిమా ఫలితం ఎలా ఉన్నా ఈ సినిమాలో నటించిన హీరోయిన్ ఐశ్వర్య మీనన్‌కు అదిరిపోయే అవకాశం వచ్చిందని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా నుంచి ఐశ్వర్య మీనన్‌కు పిలుపు వచ్చిందని సమాచారం.
డిసెంబరులో ఓజీ రిలీజ్?
ఓజీ సినిమాలో కీలక రోల్ కోసం కోసం ఐశ్వర్య మీనన్‌ని మేకర్స్ సంప్రదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ విషయమై ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. కానీ, సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే, సాహో దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. కొత్త షెడ్యూల్ మరికొద్ది రోజుల్లోనే ప్రారంభమవుతుందని మేకర్స్ ప్రకటించారు. ఓజీ సినిమాలో ప్రకాష్ రాజ్, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, తమిళ నటుడు అర్జున్ దాస్, శ్రియా రెడ్డి ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. డిసెంబర్ నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.