శ్రీదేవి 60వ జయంతి: డూడుల్‌తో గౌరవించిన గూగుల్
శ్రీదేవి.. భారతీయ సినీ చరిత్రపై చెరగని సంతకం. తన నటనతో యావద్దేశాన్ని మంత్రముగ్ధుల్ని చేసిన అతిలోక సుందరి శ్రీదేవి 2018లో ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆదివారం శ్రీదేవి 60వ జయంతి ఈ సందర్భంగా సెర్చ్ ఇంజిన్ గూగుల్, ప్రత్యేకమైన డూడుల్‌తో గౌరవించింది. ఈ డూడుల్‌ని ముంబైకి చెందిన భూమికా ముఖర్జీ డిజైన్ చేసారు. 1963 ఆగస్టు 13వ తేదీన తమిళనాడులో జన్మించారు. శ్రీదేవి తన నాలుగో ఏట సినిమాల్లోకి అడుగుపెట్తారు. ఆమె మొదటి చిత్రం కందాన్ కరుణై తమిళంలో విడుదలైంది. తెలుగులో ఆమె మొదటగా 1970లో 'మా నాన్న నిర్దోషి' చిత్రంలో నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, హిందీ సినిమాల్లో దాదాపు 300కు పైగా చిత్రాల్లో శ్రీదేవి నటించారు.
6ఫిలిమ్ ఫేర్ అవార్డులు అందుకున్న శ్రీదేవి
1976లో పదమూడేళ్ళ ప్రాయంలో శ్రీదేవి హీరోయిన్‌గా 'మూండ్రు ముడిచు' సినిమా విడుదలైంది. ఈ సినిమాలో కమల్ హాసన్, రజనీకాంత్ నటించారు. ఆ తర్వాత వరుసగా హీరోయిన్‌గా సినిమాలు చేసారు. తెలుగులో పదహారేళ్ళ వయసు సినిమాలో నటనకు గాను ఫిలిమ్ ఫేర్ అవార్డుకు శ్రీదేవి నామినేట్ అయ్యారు. శ్రీదేవి కెరీర్లో 6ఫిలిమ్ ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు. అందులో 3హిందీలో, 2తమిళంలో, 1తెలుగులో అందుకున్నారు. శ్రీదేవి చివరి చిత్రం మామ్ 2017లో రిలీజైంది. ఈ సినిమాలో ఆమె నటనకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. భారతీయ సినిమా రంగానికి శ్రీదేవి విశేష సేవలందించారు.