Peddi Pre-Release Event : 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్టార్ హీరో రాక?.. మెగా ఫ్యాన్స్‌లో జోష్!
ఈ వార్తాకథనం ఏంటి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' ప్రమోషన్స్ చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ముంబైలో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ నిర్వహించిన చిత్ర బృందం, అనంతరం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌తో ప్రత్యేక మ్యూజికల్ కాన్సర్ట్‌ను నిర్వహించింది. ఆ తర్వాత బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో ప్రెస్ మీట్స్ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు మేకర్స్ సర్వం సిద్ధం చేశారు. ఈ వేడుకను ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
వివరాలు
ఇప్పటివరకూ అధికారిక ప్రకటన ఇవ్వని చిత్రబృందం
జూన్ 1వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్ వేదికగా ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది. భారీ సంఖ్యలో మెగా అభిమానులు హాజరయ్యే అవకాశం ఉండటంతో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎవరు హాజరవుతారన్న అంశం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడకపోయినా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొనే అవకాశముందని ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
వివరాలు
ఒకే వేదికపై అబ్బాయి, బాబాయ్
పవన్ కళ్యాణ్ అందుబాటును దృష్టిలో ఉంచుకుని విజయవాడలోనే ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేసినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే ఒకే వేదికపై బాబాయ్ పవన్ కళ్యాణ్, అబ్బాయ్ రామ్ చరణ్ కనిపించనున్న నేపథ్యంలో మెగా అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొనే అవకాశం ఉంది. ఈ వేడుకలో హీరో రామ్ చరణ్‌తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సనతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని సందడి చేయనున్నారు.