నారాయణ అండ్ కో ట్రైలర్: దేడ్ దిమాక్ బ్యాచ్ పుట్టించే నవ్వుల అల్లరి
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఒకానొక హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధాకర్ కొమాకుల, ఆ తర్వాత సోలో హీరోగా చేసిన సినిమాలతో ఫ్లాపులు మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం సుధాకర్ నుండి మరో కొత్త సినిమా వస్తోంది. ఈసారి నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకుని నారాయణ అండ్ కో అనే ఫ్యామిలీ కామెడీ డ్రామను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. నారాయణ అండ్ కో ట్రైలర్ ఈరోజే విడుదలైంది. ట్రైలర్ ని కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలతో నింపేసారు. బ్యాంక్ క్యాషియర్ నాన్న, చీరలను ఇష్టపడే అమ్మ, ఎదిగిన ఇద్దరు కొడుకులు కలిసి చేసిన అల్లరే ఈ సినిమా. ట్రైలర్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేసారు.
ఆకట్టుకుంటున్న డైలాగులు
సుధాకర్ కొమాకుల కొత్తగా ఉన్నాడు. అంతకుముందు సినిమాలతో పోలిస్తే మరింత హ్యాండ్సమ్ గా, నటనలోనూ మరింత పరిణతి చూపించినట్లు అర్థమవుతోంది. తల్లిదండ్రులుగా నటించిన ఆమని, దేవిశ్రీ ప్రసాద్ ల మధ్య కామెడీ సన్నివేశాలు కడుపుబ్బా నవ్వించేలా ఉన్నాయి. కష్టాలు, క్రెడిట్ కార్డుల్లాంటివి, సొల్యూషన్స్, డబ్బులు శాలరీ లాంటివి.. అందేలోగానే ఆవిరైపోతాయి అనే డైలాగులు బాగున్నాయి. మొత్తానికి ట్రైలర్ తో మంచి పాజిటివిటీని నారాయణ అండ్ కో తెచ్చుకుందనే చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్, సుఖ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిన్న పాపిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అరతి పొడి, యామిని బి, జయక్రిష్ణ, సప్తగిరి కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. జూన్ 30వ తేదీన థియేటర్లలో రిలీజ్ అవుతుంది.