ఉడుపిలో సుధీర్ బాబు హరోం హర షూటింగ్: ఫస్ట్ లుక్ పై క్లారిటీ వచ్చేసింది
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ హరోం హర నుండి అప్డేట్ వచ్చింది. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలో ఉడిపిలో జరుగుతోంది. ఈ మేరకు చిత్రబృందం ఒక ఫోటోను బయటపెట్టింది. మరికొన్ని రోజుల పాటు ఇక్కడే షూట్ చేస్తారట. ఆ తర్వాత కొత్త ప్రదేశంలో కొత్త షెడ్యూల్ మొదలవుతుందని తెలియజేసారు. అంతేకాదు, మరికొద్ది రోజుల్లో హరోం హర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంత నేపథ్యంలో 1989 సంవత్సరం నాటి పరిస్థితుల్లో హరోం హర కథ జరుగుతుందట.
డిసెంబర్ లో రిలీజ్ కానున్న హరోం హర
ఈ పీరియాడిక్ డ్రామాలో పవర్ ఫుల్ క్యారెక్టర్ లో సుధీర్ బాబు కనిపించనున్నారు. శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా జి సుమంత్ నాయుడు నిర్మిస్తున్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ లో హరోం హర చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్రయత్నిస్తోంది. గతకొన్ని రోజులుగా సుధీర్ బాబుకు సరైన హిట్ దొరకలేదు. సమ్మోహనం తర్వాత సుధీర్ బాబు నటించిన వి, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, హంట్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద తీవ్రంగా నిరాశ పరిచాయి. మరి ఈసారి పాన్ ఇండియా హరోం హర సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.