LOADING...
Actress Prathyusha: కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడు ఆత్మహత్యాయత్నం.. ప్రత్యూష కేసు వెనుక ఆసక్తికర నిజాలివే!
కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడు ఆత్మహత్యాయత్నం.. ప్రత్యూష కేసు వెనుక ఆసక్తికర నిజాలివే!

Actress Prathyusha: కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడు ఆత్మహత్యాయత్నం.. ప్రత్యూష కేసు వెనుక ఆసక్తికర నిజాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 17, 2026
01:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్లామర్‌ కాంతులతో మెరిసే సినీ ప్రపంచంలో తెర వెనుక ఎన్నో చీకటి కథలు దాగి ఉంటాయి. తెరపై చిరునవ్వులు చిందిస్తూ అభిమానులను అలరించే నటీనటుల జీవితాల్లో, బయటకు తెలియని విషాదాలు చోటుచేసుకున్న సందర్భాలున్నాయి. అలాంటి దురదృష్టకర కథలలో ఒకటి నటి ప్రత్యూషది. తన అందమైన నవ్వుతో యువత హృదయాలను గెలుచుకున్న ఈ నటి, కెరీర్‌ ఉత్సాహంగా సాగుతున్న వేళ ప్రేమలో పడి విషాదాంతం చెందింది.

Details

'లవ్లీ స్మైల్'తో వెండితెరపైకి…

తెలంగాణలోని భువనగిరిలో జన్మించిన ప్రత్యూష చిన్ననాటి నుంచే హీరోయిన్ కావాలనే లక్ష్యంతో ముందుకెళ్లింది. ఓ అందాల పోటీలో 'మిస్ లవ్లీ స్మైల్' బిరుదు గెలుచుకోవడం ఆమె జీవితానికి కీలక మలుపుగా మారింది. అదే గుర్తింపు ఆమెకు 1998లో వచ్చిన 'రాయుడు' సినిమాలో అవకాశం తెచ్చింది. అక్కడి నుంచి తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ కేవలం నాలుగేళ్లలోనే 12 చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. తెలుగులో 'శ్రీరాములయ్య', 'సముద్రం', 'స్నేహమంటే ఇదేరా', 'కలుసుకోవాలి' వంటి చిత్రాల్లో ప్రేక్షకులను అలరించింది.

Details

ఆ రోజు ఏం జరిగింది..?

కెరీర్‌ వేగంగా ముందుకెళ్తున్న సమయంలో 2002 ఫిబ్రవరి 23న ప్రత్యూష గురించి వెలువడిన వార్త సినీ పరిశ్రమను, అభిమానులను తీవ్రంగా కుదిపేసింది. ఇంట్లో పెళ్లికి అంగీకారం లభించకపోవడంతో తన ప్రియుడు సిద్ధార్థరెడ్డితో కలిసి ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం వెలువడింది. కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తాగారని, ఇద్దరినీ ఆసుపత్రికి తరలించినట్లు వార్తలు వచ్చాయి. ఫిబ్రవరి 24న ప్రత్యూష మృతి చెందగా, సిద్ధార్థరెడ్డి ప్రాణాలతో బయటపడి కొన్ని రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. తొలుత ప్రేమికుల ఆత్మహత్యాయత్నంగా భావించిన ఈ కేసు తర్వాత కీలక మలుపు తిరిగింది.

Advertisement

Details

'హత్య' అంటూ ప్రచారం…

ప్రత్యూష మరణానికి విషం కారణం కాదని, ఎవరో గొంతు నులిమి ఊపిరాడకుండా చేశారని ఓ ఫోరెన్సిక్ నివేదిక వెలుగులోకి రావడంతో హత్య అనుమానాలు వ్యక్తమయ్యాయి. మరణానికి ముందు ఆమె వాంగ్మూలం నమోదు చేయకపోవడం కూడా అనుమానాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు కోసం ప్రత్యేక వైద్యుల బృందాన్ని నియమించింది. ఆ బృందం సమగ్రంగా విచారించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పురుగుల మందు సేవించడం వల్లే ప్రత్యూష మరణించిందని, గొంతు నులిమివేయడం లేదా లైంగిక దాడి జరగలేదని తేల్చింది. ఈ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపట్టిన సీబీఐ, సిద్ధార్థరెడ్డిపై ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న అభియోగాలు నమోదు చేసింది.

Advertisement

Details

సిద్ధార్థరెడ్డికి ఐదేళ్ల జైలు శిక్ష

ఈ కేసులో హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు సిద్ధార్థరెడ్డిని దోషిగా తేల్చి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం హైకోర్టును ఆశ్రయించగా శిక్షను మూడేళ్లకు తగ్గించారు. దీనిపై సుప్రీంకోర్టులో సవాలు చేసినప్పటికీ ఉపశమనం లభించలేదు. నిందితుడు లొంగిపోవాలంటూ ఫిబ్రవరి 17న అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రత్యూష తల్లి సరోజినీ దేవి సుదీర్ఘ న్యాయపోరాటం చేశారు. తన కూతురు మరణం వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు వరకు వెళ్లి వాదనలు వినిపించారు. ప్రస్తుతం ఆమె తన కూతురు పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.

Advertisement